RSS చీఫ్ మోహన్ భగవత్ ఈ నెలలో (మార్చి 2025) చేసిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ఆయన పర్యటన వీడియో క్లిప్‌లతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీడియో ఒకటి (ఇక్కడ) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ట్రంప్ మాట్లాడుతూ, కొంతమంది డోని పోలో (అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థానిక మతం) నాయకులు తాని తెగ వారిని, తాని క్రైస్తవులకు వ్యతిరేకంగా పోరాడేలా RSS నుండి డబ్బు అందుకున్నారని అనడం మనం వినవచ్చు. ఈ వీడియోను ‘My friend డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ RSS గురించి ఏమంటున్నాడో వినండి.. ముఖ్యం గా RSS లో ఉన్న బీసీ ఎస్సి ఎస్టీ లు వినండి…‘ అని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తాని తెగ ప్రజలకు అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, RSS యొక్క పన్నాగాన్ని బయటపెడుతూ, సందేశం ఇస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది “AI of Arunachal Pradesh” అనే Facebook పేజీ ద్వారా సృష్టించబడిన స్క్రిప్టెడ్ డీప్‌ఫేక్ వీడియో. ఈ వీడియోను AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి తయారు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. కావున, ఈ పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ క్లెయిమ్ యొక్క వాస్తవికతను వెరిఫై చేయడానికి, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తాని తెగ మరియు డోని పోలో మతం గురించి ఏవైనా వ్యాఖ్యలు చేశారా అని తెలుసుకోవడానికి మేము ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేశాము. అయితే, ఈ విషయాన్ని ధృవీకరించే ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు మాకు దొరకలేదు.
తరువాత, వైరల్ వీడియో గురించి మరింత తెలుసుకోవడానికి, సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో మరొక సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, మాకు 3 మార్చి 2025న AI of Arunachal Pradesh అనే పేజీ వారు చేసిన Facebook పోస్ట్ (ఆర్కైవ్ లింక్) ఒకటి లభించింది, ఇందులో వైరల్ వీడియో ఉంది.

ఈ వీడియోలో ‘These are just my assumptions considering all the events happening in Arunachal Pradesh,’అని చెప్పే వివరణ ఉంది. అలాగే, ఈ పేజీ యొక్క ‘intro’ విభాగంలో, ఈ పేజీలో ప్రముఖ వ్యక్తులు AI రూపాలను ఉపయోగించి స్క్రిప్టెడ్ వీడియోలను అప్లోడ్ చేస్తాను అని రాసి ఉంది. అంటే, ఈ పేజీ వారు తయారు చేసిన, AI-జనరేటెడ్ స్క్రిప్టెడ్ డీప్‌ఫేక్ వీడియోని, నిజమైనదిగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఇది మనకి స్పష్టం చేస్తుంది. వైరల్ వీడియోను మీరు సరిగ్గా గమనిస్తే, ట్రంప్ పెదవి కదలికలతో, అందులో ఉన్న ఆడియో సరిగ్గా మ్యాచ్ అవడం లేదు అని అర్థం అవుతుంది.

ఇంకా, ఈ వీడియోకి మరియు గతంలో మేము ఫాక్ట్-చెక్ చేసిన కొన్ని డొనాల్డ్ ట్రంప్ AI- జనరేటెడ్ వీడియోల (ఇక్కడ, ఇక్కడ) మధ్య సారూప్యతలను మేము గమనించాము. ఈ వీడియోలు ట్రంప్ 2017లో NBC న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ యొక్క చిన్న క్లిప్‌ను ఉపయోగించి తయారు చేసిన డీప్‌ఫేక్‌లు. వైరల్ వీడియోను సరిగ్గా చూస్తే, దీన్ని కూడా అదే ఇంటర్వ్యూ క్లిప్ ఉపయోగించి తయారు చేశారు అని మాకు అర్థం అయ్యింది.
అదనంగా, భారత ప్రభుత్వం యొక్క ఫాక్ట్-చెక్ సంస్థ, PIB ఫాక్ట్ చెక్ ఈ వీడియోపై ‘X’ ద్వారా ఒక వివరణ ఇచ్చింది. ఇది డిజిటల్‌గా ఎడిట్ చేసిన నకిలీ వీడియో అని వారు చెప్పారు.
చివరగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తాని తెగలో అల్లర్లు సృష్టించడానికి డోని పోలో నాయకులకు RSS డబ్బు ఇస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న వీడియో అని ఒక డీప్‌ఫేక్ వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.