Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు రిక్షా నడిపే ఒక ముస్లిం వ్యక్తిని కొడుతున్న దృశ్యాలంటూ 2020లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో పోలీసులు ఒక వ్యక్తిని కొట్టిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఖాకీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ఒక వ్యక్తిని క్రూరంగా కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక ముస్లిం రిక్షా వాడిని  కొడుతున్నారనే వాదనలతో ఈ వీడియో షేర్ చేయబడుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు రిక్షా నడిపే ఒక ముస్లిం వ్యక్తిని క్రూరంగా కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కు సంబంధించింది కాదు. 10 మే 2020న మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా, సౌన్సర్ తహసీల్‌లో జరిగింది. మద్యం తాగి బ్యాంకు వద్ద సమస్య సృష్టించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల తర్వాత ఇంటికి పంపించారు. అతనిపై లాక్‌డౌన్ ఉల్లంఘనకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఈ ఘటనపై విచారణ జరిపి, సంబంధం ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. పంజాబ్ కేసరి MP కథనం ప్రకారం, అతడిని వామన్ సరైగా గుర్తించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ మే 2020లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం,ఈ ఘటన 10 మే 2020న మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా, సౌన్సర్ తహసీల్‌లో జరిగింది. మద్యం తాగి బ్యాంకు వద్ద సమస్య సృష్టించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించి, అతని నివాసానికి పంపించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. అతనిపై లాక్‌డౌన్ ఉల్లంఘనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. 

వీడియో వైరల్ అయిన తర్వాత అదనపు ఎస్పీ శశాంక్ గర్గ్ దర్యాప్తునకు ఆదేశించగా, ఈ ఘటనలో సంబంధం ఉన్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ డోంగ్రే, కానిస్టేబుల్ ఆశిష్‌లను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతికినప్పుడు, 24 మే 2020న పంజాబ్ కేసరి MP యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేసిన వీడియో లభించింది. ఈ వీడియోలోనూ ఇదే దృశ్యాలు కనిపించాయి. కథనం ప్రకారం, మద్యం తాగి బ్యాంకు వద్ద సమస్య సృష్టించిన వ్యక్తిని వామన్ సరైగా గుర్తించారు.

చివరిగా, 2020లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో పోలీసులు ఒక వ్యక్తిని కొట్టిన వీడియోను  ఉత్తరప్రదేశ్‌ పోలీసులు రిక్షా నడిపే ఒక ముస్లిం వ్యక్తిని కొడుతున్న దృశ్యాలంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll