“జనసేన పార్టీ కౌన్సిలర్‌ని బట్టలు చింపి కొట్టిన టీడీపీ కౌన్సిలర్” అని చెప్తూ, ఓ ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఈ వీడియోలో జనసేన పార్టీ కౌన్సిలర్‌ని టీడీపీ కౌన్సిలర్ కొడుతున్నాడు.
ఫాక్ట్: మొదటగా, ఈ సంఘటన 2016 లో తెనాలిలో జరిగింది. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా గుమ్మడి రమేష్, పసుపులేటి త్రిమూర్తులు అనే ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసిన సంఘటనకి చెందిన వీడియో ఇది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
మొదటగా, వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఈ వీడియో కలిగి ఉన్న కొన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఇవన్నీ 2016 నాటివి.
వివరాల్లోకి వెళితే, ఈ సంఘటన 2016లో గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా, టీడీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు గుమ్మడి రమేష్ మరియు పసుపులేటి త్రిమూర్తులు, మీటింగ్ మినిట్స్ వివరాలు పుస్తకంలో రికార్డు చేసే విషయంలో విభేదించారు, ఇది వారి మధ్య ఘర్షణకు దారితీసింది (ఇక్కడ,ఇక్కడ).
చివరిగా, 2016లో తెనాలి మునిసిపల్ కౌన్సిల్‌లో ఇద్దరు టీడీపీ కౌన్సిలర్‌ల మధ్య జరిగిన తన్నులాట వీడియోని ఇప్పుడు జనసేన పార్టీ కౌన్సిలర్‌ని బట్టలు చింపి కొట్టిన టీడీపీ కౌన్సిలర్ వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.