కర్ణాటకలో హిజాబ్‌కి సంబంధించి జరుగుతున్న నిరసనల్లో ముస్లింలు జరిపిన రాళ్లదాడిలో గాయపడిన హిందూ అమ్మాయి అంటూ ఒక అమ్మాయిని మోసుకెల్తున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ నిరసనల్లో ముస్లింలు జరిపిన రాళ్లదాడిలో హిందూ అమ్మాయి గాయపడిన ఘటనకి సంబంధించిన వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో బాగల్‌కోట్ జిల్లా, రబకవి బనహట్టిలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో ఒక అమ్మాయి అస్వస్థత మరియు అలసిపోవడం వల్ల స్పృహతప్పి పడిపోబోగా కాలేజీ సిబ్బంది ఆమెని బయటికి తీసుకెళ్ళిన ఘటనకు సంబంధించింది. ఐతే ఆ సమయంలో కాలేజీ బైట హిజాబ్ నిరసనలు జరుగుతునప్పటికీ, పోస్టులో క్లెయిమ్ చేస్తునట్టు ఆ అమ్మాయి నిరసనకారులు జరిపిన రాళ్లదాడిలో గాయపడలేదు. ఇదే విషయాన్ని పలువురు జర్నలిస్టులు, జిల్లా ఎస్పీ దృవీకరించారు. వీడియోలోని అమ్మాయి ఖాళీ కడుపుతో కాలేజీకి హాజరవడంతో స్పృహతప్పి పడిపోయిందని, రాళ్ళ దాడిలో గాయపడినందుకు కాదని కాలేజీ ప్రిన్సిపాల్ స్పష్టం చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిజాబ్ అనుకూల, వ్యతిరేక నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాగల్‌కోట్ జిల్లాలోని రబకవి బనహట్టి ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీ వెలుపల నిరసనకారులు రాళ్లు రువ్వుకున్నట్టు, ఈ ఘటనలో ఒక అబ్బాయి గాయపడ్డట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఐతే వైరల్ వీడియోలోని అమ్మాయి మాత్రం ఈ రాళ్ల దాడిలో గాయపడలేదు.
ఈ వీడియోలోని అమ్మాయి అస్వస్థత మరియు అలసిపోవడం వల్ల స్పృహతప్పి పడిపోబోగా కాలేజీ సిబ్బంది ఆమెని బయటికి తీసుకెళ్లారని, ఆ అమ్మాయి రాళ్ల దాడిలో గాయపడలేదని ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేసాడు.
ఆల్ట్ న్యూస్ అనే ఫాక్ట్-చెకింగ్ సంస్థ కాలేజీ ప్రిన్సిపాల్‌ను వీడియోకి సంబంధించి వివరణ కోసం సంప్రదించగా, వీడియోలోని అమ్మాయి ఖాళీ కడుపుతో కాలేజీకి రావడంతో నీరసం వల్ల స్పృహతప్పి పడిపోబోగా కాలేజీ సిబ్బంది ఆమెని బయటికి తీసుకెళ్లారని, ఆమె నిరసనల్లో గాయపడలేదని స్పష్టం చేసాడు.
జిల్లా ఎస్పీ కూడా ఆ అమ్మాయి అనారోగ్యం మరియు కాలేజీ బయట జరుగుతున్న నిరసనల ఒత్తిడి వల్ల స్పృహతప్పి పడిపోబోగా కాలేజీ సిబ్బంది ఆమెని బయటికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. వీటన్నిటిబట్టి, వైరల్ వీడియోలోని అమ్మాయి రాళ్ళ దాడిలో గాయపడలేదని స్పష్టమవుతుంది.
చివరగా, అలసట వల్ల స్పృహ తప్పిన అమ్మాయి వీడియోని హిజాబ్ నిరసనల్లో భాగంగా ముస్లింలు జరిపిన రాళ్ల దాడిలో గాయపడిన హిందూ అమ్మాయి అంటూ షేర్ చేస్తున్నారు.