కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ ఘటనల్లో భాగంగా, ముస్కాన్ ఖాన్ రాహుల్ గాంధీని కలిసిన ఫోటో అంటూ ఒక పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో కొందరు వ్యక్తులు ‘జై శ్రీ రామ్’ అని ముస్కాన్ ముందు నినాదాలు చేయగా, వారికి బదులిస్తూ తను ‘అల్లా హు అక్బర్’ అన్న వీడియో చాలా వైరల్ అయింది. ఆ నేపథ్యంలో ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రాహుల్ గాంధీని కలిసిన ముస్కాన్ ఖాన్ యొక్క ఫోటో.
ఫాక్ట్: ఈ ఫోటోలో రాహుల్ గాంధీతో ఉన్నది ముస్కాన్ ఖాన్ కాదు. ఫోటోలో బుర్కా లేకుండా ఉన్నది జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్. జమియత్ ఉలామా-ఏ-హింద్ అనే సంస్థ ముస్కాన్ ఖాన్‌కు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో చెప్పారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో ఒక ఫేస్‌బుక్ పోస్టులో లభించింది. ఆ ఫోటో పోస్ట్ చేసిన అకౌంట్ జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ యొక్క ఫేస్‌బుక్ అకౌంట్. జార్ఖండ్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి రాహుల్ గాంధీని 08 ఫిబ్రవరి 2022న కలిసినట్టు తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో అంబా ప్రసాద్ పోస్ట్ చేసారు. అంబా ప్రసాద్ యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా ఇదే ఫోటోను పోస్ట్ చేసారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినప్పుడు, ఫోటోలో ఉన్నది తనే అని అంబా ప్రసాద్ ట్వీట్ కూడా చేసారు. వైరల్ చేస్తున్నవారిపై చర్య తీసుకోవాలంటూ జార్ఖండ్ పోలీస్‌ని కూడా ట్యాగ్ చేసారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీని ఢిల్లీలో ఇటీవల కలిసినప్పుడు అంబా ప్రసాద్ కూడా ఉన్నారు.
కర్ణాటకలో విద్యార్థులు హిజాబ్ అనుకూల, వ్యతిరేక నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా మాండ్యాలో ముస్కాన్ ఖాన్ అనే ఒక విద్యార్థి హిజాబ్ ధరించి కాలేజీ రావడంతో, కాషాయ కండువాలు ధరించిన కొందరు విద్యార్థులు ‘జై శ్రీ రామ్’ అని ముస్కాన్ ముందు నినాదాలు చేయగా, వారికి బదులిస్తూ తను ‘అల్లా హు అక్బర్’ అన్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జమియత్ ఉలామా-ఏ-హింద్ అనే సంస్థ ముస్కాన్ ఖాన్‌కు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో రాశారు.
చివరగా, ఫోటోలో బుర్కా లేకుండా రాహుల్ గాంధీతో ఉన్నది ముస్కాన్ ఖాన్ కాదు; తను జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్.