“దేవాలయాల భూములు అమ్మైనా ముస్లింల అభివృద్ధికి పాటుపడుతా అని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 29 మే 2024న నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 53ఎకరాల భూమిని దేవాదాయ శాఖ ద్వారా బహిరంగ వేలం వేస్తున్నారు”, అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) . ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 53 ఎకరాల భూమి విక్రయానికి రాష్ట్ర దేవాదాయ శాఖ బహిరంగ వేలం నిర్వహించనుంది.
ఫాక్ట్(నిజం): ఇదే విషయంపై Factly నల్గొండలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం EO(కార్యనిర్వాహణాధికారి)ని సంప్రదించగా, ఆయన ఈ పోస్టులో ఎలాంటి వాస్తవం లేదని, ఆలయానికి చెందిన 53 ఎకరాల 24 గుంటల వ్యవసాయ భూమిని కౌలు ఇవ్వడానికి మాత్రమే దేవాదాయ శాఖ ప్రకటన జారీ చేసినట్లు తెలిపారు, అందుకు సంబంధించిన ప్రకటన ప్రతిని షేర్ చేశారు. అలాగే, ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న పోస్టులపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని నల్గొండ రొండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 53 ఎకరాల భూమిని రాష్ట్ర దేవాదాయ శాఖ బహిరంగ వేలం నిర్వహిస్తుందా?అని తెలుసుకోవడానికి మేము ముందుగా నల్గొండ జిల్లా దేవాదాయ – ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ను సంప్రదించగా, ఆయన ఈ పోస్టులో ఎలాంటి వాస్తవం లేదని, ఈ తప్పుడు ప్రచారం పై రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం EO (కార్యనిర్వాహణాధికారి) పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తదుపరి మేము పూర్తి సమాచారం కోసం రామగిరి సీతారామచంద్రస్వామి దేవస్థానం EO ను సంప్రదించగా, ఆయన కూడా ఈ పోస్టులో ఎలాంటి వాస్తవం లేదని, రామగిరి సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 53 ఎకరాల 24 గుంటల వ్యవసాయ భూమిని 2 సంవత్సరాలకు అనగా (2024-26) కౌలు ఇవ్వడానికి 29 మే 2024న బహిరంగ వేలం నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకటన జారీ చేసినట్లు తెలియజేసారు. కొందరు ఈ కౌలుకు సంబంధించిన బహిరంగ వేలం ప్రకటనను కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని, ఇలా దేవాలయాలకు చెందిన వ్యవసాయ భూములను ప్రతి సంవత్సరము కౌలుకు ఇవ్వడానికి దేవాదాయ శాఖ వేలం వేయడం సాధరణ ప్రక్రియ అని ఆయన తెలిపారు. ఈ తప్పుడు పోస్టులపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని నల్గొండ రొండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన మాకు రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 53 ఎకరాల 24 గుంటల భూమిని కౌలు ఇవ్వడానికి దేవాదాయ శాఖ జారీ చేసిన ప్రకటన ప్రతిని కూడా షేర్ చేసారు. ఈ తప్పుడు ప్రచారం నేపథ్యంలో 29 మే 2024న నిర్వహించాల్సిన కౌలు బహిరంగ వేలాన్ని కూడా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. దీన్ని బట్టి కేవలం నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 53 ఎకరాల 24 గుంటల వ్యవసాయ భూమిని కౌలు ఇవ్వడానికి మాత్రమే దేవాదాయ శాఖ ప్రకటన జారీ చేసినట్లు మనం నిర్థారించవచ్చు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయాల భూములు అమ్మైనా ముస్లింల అభివృద్ధికి పాటుపడుతా అని అన్నట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ముస్లిం డిక్లరేషన్ అమలుకు అవసరమైతే ఆలయ భూములు వేలం వేస్తామని రేవంత్ రెడ్డి అన్నట్టు గతంలో ఒక పోస్టు వైరల్ అయినప్పుడు దాన్ని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly పబ్లిష్ చేసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, నల్గొండలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూమిని కౌలు ఇవ్వడానికి మాత్రమే దేవాదాయ శాఖ ప్రకటన జారీ చేసింది.