Fake News, Telugu
 

రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఎడ్ల బండ్ల ర్యాలీ వీడియోను లక్ష ఎడ్ల బండ్లతో అయోధ్యకి వెళ్తున్న హిందువులని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

లక్ష ఎడ్ల బండ్లు కట్టుకుని అయోధ్యకు వెళ్తున్న హిందువులు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా ఎడ్ల బండ్లు ర్యాలీగా వెళ్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: లక్ష ఎడ్ల బండ్లు కట్టి అయోధ్యకి వెళ్తున్న హిందువులను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): వైరల్ వీడియోలో చూపిస్తున్న దృశ్యాలు 10 జనవరి 2024న రాజస్థాన్ రాష్ట్రం భిల్వారా నగరంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జరిగిన ర్యాలీకి సంబంధించినవి.అలాగే లక్ష ఎడ్ల బండ్లు కట్టుకుని హిందువులు ర్యాలీగా అయోధ్యకి వెళ్ళడానికి సంబంధించిన ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా లక్ష ఎడ్ల బండ్లు కట్టుకుని హిందువులు ర్యాలీగా అయోధ్యకు వెళ్లారా అని ఇంటర్నెట్‌లో వెతికితే, మాకు అలాంటి రిపోర్ట్స్ ఏవీ లభించలేదు. ఒకవేళ అలా వెళ్లి ఉంటే ఖచ్చితంగా మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది.

తర్వాత ఈ ఎడ్ల బండ్ల ర్యాలీకి సంబంధించి సమచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయగా, ఈ ఎడ్ల బండ్ల ర్యాలీని రిపోర్ట్ చేస్తూ ప్రచురించిన పలు మీడియా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ మీడియా రిపోర్ట్స్ ప్రకారం “పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు, మొక్కలు నాటేందుకు అప్న సంస్థాన్ 10 జనవరి 2024 నుంచి ఐదు రోజులపాటు ‘హరిత్ సంగం’ అనే పర్యావరణ ప్రదర్శనను ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదటి రోజుపశువులను రక్షించడంతోపాటు వాహన కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పురపాలక సంఘం,అప్నా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 101 ఎద్దుల బండ్ల యాత్ర చేపట్టారు.ఈ యాత్ర రాజస్థాన్ రాష్ట్రం భిల్వారా నగరంలోని మోదీ గ్రౌండ్ నుండి ప్రారంభమై నగరంలోని ప్రధాన రహదారి గుండా చిత్రకూట్ ధామ్‌కు చేరుకుంది”.

ఈ మీడియా రిపోర్ట్స్ ఆధారంగా, మేము గూగుల్ మ్యాప్స్‌లో వైరల్ వీడియోలో చూపిస్తున్న  ప్రదేశల యొక్క ఖచ్చితమైన స్థానాన్ని జియోలొకేట్ చేసాము. స్ట్రీట్ వ్యూ ఇమేజ్‌తో వైరల్ వీడియో నుండి తీసిన స్క్రీన్‌షాట్‌లను పోల్చిన తర్వాత, ఈ వీడియో రాజస్థాన్ రాష్ట్రం భిల్వారా నగరంలో జరిగిన ఎడ్ల బండ్ల ర్యాలీకి చెందినదిగా నిర్థారించవచ్చు.

చివరగా, రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఎడ్ల బండ్ల ర్యాలీకి సంబంధించిన వీడియోను లక్ష ఎడ్ల బండ్లతో అయోధ్యకి వెళ్తున్న హిందువులని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll