Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేస్తాం అని అన్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

‘ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చిన వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవటానికి మా మహిళలు అందరం కీలక పాత్ర వహిస్తాం’ అని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని వాస్తవాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: రాబోయే ఎన్నికల్లో జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేయటంలో మహిళలు అందరూ కీలక పాత్ర వహించబోతున్నాము – టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత.

ఫాక్ట్ (నిజం): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర సందర్భంగా పీలేరులోని క్యాంప్ సైటులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖి కార్యక్రమంలో, టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ప్రసంగించారు. ప్రసంగంలో తాను మాట్లాడుతూ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా జగన్‌మోహన్ రెడ్డిని గద్దె దింపి, చంద్రబాబు నాయుడుని సీఎం చేసే విషయంలో మహిళలం అందరం కీలక పాత్ర వహించబోతున్నాం అన్న సంగతి మీ అందరికి తెలియచేసుకొంటున్నాను అని అన్నారు. ఈ ప్రసంగం వీడియోని జగన్‌మోహన్ రెడ్డిని సీఏం చేయటంలో మహిళలు అందరు కీలక పాత్ర వహించబోతున్నాము అని తాను అన్నట్లు ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు. 

సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి, వంగలపూడి అనిత ఇటీవల ఇచ్చిన ప్రసంగాల యొక్క వీడియోల కోసం ఇంటర్నెట్లో వెతుకగా, Tone News అనే వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్‌లో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా అనిత ఇచ్చిన ప్రసంగం యొక్క వీడియో దొరికింది. ఇది వైరల్ వీడియో యొక్క పూర్తి వెర్షన్.

4:15 సెకెన్ల దగ్గరనుండి ఈ ప్రసంగం వీడియో యొక్క విజువల్స్ వైరల్ విడియోతో సరిపోతున్నాయి. వంగలపూడి అనిత మాట్లాడుతూ ‘ఏ ఎలక్షన్ ఎపుడైనా రానివ్వండి… జగన్‌మోహన్ రెడ్డిని గద్దె దింపి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే విషయంలో మా మహిళలం అందరం కూడా కీలక పాత్ర వహించబోతున్నాం అన్న సంగతి  మీ అందరికి తెలియచేస్కుంటూ, అదే విషయాన్నీ మీ అందరికి భరోసా ఇస్తున్నాం అన్న సంగతి ఈ అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియ చేసుకుంటున్నాను’ అని అన్నారు. ఈ ప్రసంగాన్ని ఎడిట్ చేసి, తను రాబోయే ఎన్నికల్లో జగన్‌మోహన్ రెడ్డిని సీఏం చెయ్యటానికి మహిళలు కీలక పాత్ర వహించబోతున్నారు అని అన్నట్లు షేర్ చేస్తున్నారు. ఇదే ప్రసంగం YOYO TV యూట్యూబ్ ఛానెల్లో కూడా చూడవచ్చు.

నారా లోకేష్ యువగలం పాదయాత్ర పీలేరులో క్యాంపు సైటులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మహిళల ముఖాముఖీ కార్యక్రమంలో వంగలపూడి అనిత ఈ ప్రసంగాన్ని ఇచ్చారు (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, రాబోయే ఎన్నికల్లో జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేయటంలో మహిళలు అందరు కీలక పాత్ర వహించబోతున్నాము అని వంగలపూడి అనిత అనలేదు; ఇది ఎడిట్ చేసిన వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll