Fake News, Telugu
 

ఢిల్లీతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికే మద్యం అమ్మకాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది

0

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనితీరును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పనితీరుతో పోలుస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తుంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి మాత్రం వార్డుకు మూడు వైన్ షాప్స్ ఏర్పాటు చేస్తున్నాడంటూ ఈ పోస్టులో పోలుస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఈ పోలికలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తుంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి మాత్రం వార్డుకు మూడు వైన్ షాప్స్ ఏర్పాటు చేస్తున్నాడు.

ఫాక్ట్(నిజం):  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ సొంత ఆదాయ వనరులలో 22.6% ఎక్సైజ్ టాక్స్ నుండే ఆర్జిస్తుండగా, ఢిల్లీకి సంబంధించి ఈ వాటా కేవలం 13% గానే ఉంది. దీన్నిబట్టి, ఢిల్లీ ప్రభుత్వంతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఎక్కువగా మద్యం విక్రయాలపై ఆధార పడుతుందని అర్ధమవుతుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్న మాట నిజమైనప్పటికీ, వైద్య మౌలిక సదుపాయాల విషయంలో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ కన్నా మెరుగైన స్థితిలోనే ఉంది. 2019 నాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10,000 జనాభాకు 8 మంది వైద్యులు అందుబాటులో ఉండగా, ఢిల్లీలో ప్రతీ 10,000 జనాభాకు 10 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ అవుతున్న పోస్టులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికన్నా బాగా పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం చేసారు. ఐతే రెండు ప్రభుత్వాల పనితీరు పోల్చే క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వైద్య రంగంలో చేస్తున్న పనికి, ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రయంతో పోలుస్తూ చేసిన పోలికే అసంబద్దంగా ఉంది.  ఉత్తరప్రదేశ్ కన్నా ఢిల్లీ ప్రభుత్వం మద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని ఈ పోస్టులో చెప్పే ప్రయత్నం చేసారు.

కాని RBIలో అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి చుస్తే ఢిల్లీ ప్రభుత్వం కన్నా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఎక్కువగా ఎక్సైజ్ రెవిన్యూపై (మద్యం అమ్మకాలపై విధించే పన్ను) ఆధార పడుతోంది. రాష్ట్రాలు పన్నుల ద్వారా సొంతంగా సమకూర్చుకునే  ఆదాయంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఎక్సైజ్ రెవిన్యూ వాటా ఎక్కువగా ఉన్న రాష్టాలలో ఉత్తరప్రదేశ్ ఒకటి. ఉత్తరప్రదేశ్‌తో పోలుస్తే ఢిల్లీ ఎక్సైజ్ రెవిన్యూ వాటా చాలా తక్కువ.

2021-22 సంవత్సరానికి గాను ఉత్తరప్రదేశ్ సొంతంగా పన్నుల ద్వారా ఆర్జించిన ఆదాయంలో 22.6% ఎక్సైజ్ టాక్స్ నుండే వస్తుంది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది.

ఇదిలా ఉండగా, ఇదే సంవత్సరానికి గాను ఢిల్లీ ప్రభుత్వం సొంత ఆదాయ వనరులలో ఎక్సైజ్ రెవిన్యూ వాటా కేవలం 13% మాత్రమే. దీన్నిబట్టి, ఢిల్లీ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఎక్సైజ్ ఆదాయంపై ఆధార పడుతోందని అర్ధం చేసుకోవచ్చు.

వైద్య రంగంలోను ఢిల్లీ మెరుగైన స్థితిలోనే ఉంది:

పోస్టులో చెప్తున్నట్టు ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్న మాట నిజమైనప్పటికీ, వైద్య మౌలిక సదుపాయాల విషయంలో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ కన్నా మెరుగైన స్థితిలోనే ఉంది.

2020-21 ఎకనామిక్ సర్వే ప్రకారం 2019 నాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10,000 జనాభాకు 8 మంది వైద్యులు (అల్లోపతిక్ + ఆయుష్) అందుబాటులో ఉండగా, ఢిల్లీలో ప్రతీ 10,000 జనాభాకు 10 మంది వైద్యులు (అల్లోపతిక్ + ఆయుష్) అందుబాటులో ఉన్నారు. ఈ సమాచారం ప్రకారం ఒక్క కేరళ మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలో వైద్యుల కొరత ఉంది.

ఇకపోతే ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలు అందించే క్రమంలో మొహల్లా క్లినిక్ పేరుతో ఉచిత  వైద్య సేవలను అందించడం ప్రారంభించింది. 2022 నాటికీ ఢిల్లీలో మొత్తంగా 519 మొహల్లా క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం చెప్తున్నదాని ప్రకారం, ఈ క్లినిక్‌ల ద్వారా రోజు 60,000 మంది ఉచిత వైద్య సేవలు పొందుతున్నారు. 

చివరగా, ఢిల్లీతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే మద్యం అమ్మకాల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతోంది.

Share.

About Author

Comments are closed.

scroll