“అసదుద్దీన్ ఓవైసి పిలుపుతో మహారాష్ట్రలో ముస్లిమ్స్ ర్యాలీ ఇది. భారతదేశ భవిష్యత్ ఉహించుకోండి,”అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక రోడ్డుపై వెళ్తున్న ఒక భారీ జనసందోహాన్ని మనం చూడవచ్చు. AIMIM ఇటీవల ముంబైలో నిర్వహించిన ‘తిరంగా సంవిధాన్ ర్యాలీ’ నేపథ్యంలో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: మహారాష్ట్రలో AIMIM నిర్వహించిన ముస్లిం ర్యాలీకి చెందిన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో తూర్పు తిమోర్ దేశంలో 10 సెప్టెంబర్ 2024న పోప్ ఫ్రాన్సిస్ మూడు రోజుల పర్యటన సందర్భంగా తీసింది. తూర్పు తిమోర్‌లోని వేలాది మంది కాథలిక్కులు పోప్ ఫ్రాన్సిస్‌తో కలిసి ఒక ‘హోలీ మాస్’కు హాజరవుతున్నప్పుడు తీసిన వీడియో ఇది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోని వెరిఫై చేయడానికి అందులోని కొన్ని కీఫ్రేమ్‌లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేయగా, వైరల్ వీడియో కలిగి ఉన్న, 12 సెప్టెంబర్ 2024 నాటి సోషల్ మీడియా పోస్ట్ ఒకటి మాకు దొరికింది. పోస్ట్ యొక్క వివరణలో, తిమోర్-లేస్తే/తూర్పు తిమోర్ అనే దేశంలో జరిగిన ఒక ‘హోలీ మాస్’/ ప్రార్థనా కూడికకు సుమారు 6,00,000 మంది హాజరయ్యారు అని రాసి ఉంది.
ఈ వీడియో గురించి మరింత తెలుసుకోవడానికి, ఇంటర్నెట్లో తగిన కీ వార్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేస్తే, ఈ సంఘటనకు సంబంధించిన రాయిటర్స్ వారి కథనం ఒకటి మాకు దొరికింది. ఈ కథనం ప్రకారం 10 సెప్టెంబర్ 2024న తూర్పు తిమోర్‌లో పోప్ ఫ్రాన్సిస్ యొక్క మూడు రోజుల పర్యటన సందర్భంగా అక్కడ వందల వేల మంది కాథలిక్కులు ఆయనతో కలిసి మాస్‌కు హాజరైనట్లు ఈ వీడియో చూపిస్తుంది. దీనికి సంబంధించిన వార్తా కథనాలని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
అలాగే, వైరల్ వీడియోలో ఉన్న కొన్ని పోస్టర్‌లను రాయిటర్స్ కథనంలో ఉన్న వాటితో పోల్చినప్పుడు, రెండు విజువల్స్ ఒకే పోస్టర్‌లను కలిగి ఉన్నట్లు మాకు అర్థం అయ్యింది.
అదనంగా, మేము Google మ్యాప్స్ యొక్క ‘స్ట్రీట్ వ్యూ’ ఉపయోగించి వైరల్ వీడియోని తీసిన స్థలాన్ని గుర్తించాము. ఈ ప్రదేశం తూర్పు తైమూర్ రాజధాని నగరం ‘డిలి’కి సమీపంలో ఉంది.
చివరిగా, తూర్పు తైమూర్‌లో తీసిన వీడియోని, AIMIM మహారాష్ట్రలో నిర్వహించిన ర్యాలీకి చెందిన వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.