Fake News, Telugu
 

నిరసనకారులు రాకముందు తీసిన ఫోటో పెట్టి, ‘ఢిల్లీ ఎన్నికలు అయిపోగానే షహీన్ బాగ్ నిరసనలు ఆగిపోయాయి’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఢిల్లీ ఎన్నికలు అయిపోగానే షహీన్ బాగ్ లో CAA నిరసనలు ఆగిపోయాయని చెప్తూ, ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా  మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజు షహీన్ బాగ్ ఖాళీ టెంట్ల ఫోటో. ఢిల్లీ ఎన్నికలు అయిపోగానే షహీన్ బాగ్ లో నిరసనలు ఆగిపోయాయి.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటో ఎన్నికల ఫలితాల రోజు పొద్దున్నే షహీన్ బాగ్ లో తీసిన ఫోటో. ఫోటో తీసిన కొద్దిసేపటికి మిగితా నిరసనకారులు మళ్ళీ CAA కు నిరసన తెలుపుతూ షహీన్ బాగ్ లో వచ్చి కూర్చున్నారు. షహీన్ బాగ్ లో నిరసనలు ఆగిపోలేదు. కావున ఢిల్లీ ఎన్నికలు అయిపోగానే షహీన్ బాగ్ లో CAA నిరసనలు ఆగిపోయాయని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు..

పోస్టులోని ఫోటోని ‘అమర్ ఉజాలా’ వార్తాసంస్థ ఫిబ్రవరి 11న  ప్రచురించినట్టుగా ఇక్కడ చూడవొచ్చు. ఎన్నికల ఫలితాల రోజు పొద్దున కొంత మంది మాత్రమే షహీన్ బాగ్ లో ఉన్నారని ఆర్టికల్ లో రాసారు.

అయితే, అలాంటి ఫొటోనే ఇంకొకటి ‘ది క్వింట్’ వారు పెట్టి, అది నిరసనకారులు ఇంకా షహీన్ బాగ్ కి రాకముందు పొద్దున 8 గంటల సమయానికి తీసిసారని, పొద్దున 9 గంటల తర్వాత నిరసనకారులు రావడం మొదలు పెట్టారని ఆర్టికల్ లో రాసారు.  ఎన్నికల ఫలితాల రోజు షహీన్ బాగ్ దృశ్యాలు చూపిస్తూ ‘ది క్వింట్’ వారు పెట్టిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

‘అమర్ ఉజాలా’ వారు ప్రచురించిన ఫోటోని తీసుకొని, ఢిల్లీ ఎన్నికలు అయిపోయినందున షహీన్ బాగ్ లో CAA కి విరుద్ధంగా చేస్తున్న నిరసన ఆపేసారని సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. అయితే, తాము ఎక్కడికి వెళ్లలేదని ‘అమర్ ఉజాలా’ వారు ఫోటోలు తప్పుగా చూపిస్తున్నారని ‘Shaheen Bagh Official’ (@Shaheenbaghoff1) ట్విట్టర్ అకౌంట్ ద్వారా షహీన్ బాగ్ నిరసనకారులు ట్వీట్ చేసారు (‘Shaheen Bagh Official’ వెరిఫైడ్ పేజీ కానప్పటికీ, కొద్ది రోజులుగా షహీన్ బాగ్ నిరసనకి సంబంధించిన అన్నీ అప్డేట్లు అక్కడ పెడుతున్నారు). అంతేకాదు, జామియా విద్యార్థుల పై ఢిల్లీ పోలీసుల హింసకి విరుద్ధంగా ఫిబ్రవరి 11న  షహీన్ బాగ్ లో మౌనంగా నిరసన తెలిపినట్టు మరొక ట్వీట్ చేసారు.

పోస్టులోని ఫోటో ఫిబ్రవరి 11 పొద్దున  తీసారు. కానీ, ఆ ఫోటో తీసిన తరువాత కూడా నిరసనలు కొనసాగినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.  కావున, ఎన్నికల ఫలితాలు రాగానే షహీన్ బాగ్ లో నిరసనలు ఆగిపోలేదు.

చివరగా, నిరసనకారులు రాకముందు తీసిన ఫోటో పెట్టి, ‘ఢిల్లీ ఎన్నికలు అయిపోగానే షహీన్ బాగ్ నిరసనలు ఆగిపోయాయి’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll