Fake News, Telugu
 

ఏడేళ్ళలో మోదీ భోజన ఖర్చు 100 కోట్లు దాటిందన్నది ఒక కల్పిత వార్త

0

RTI సమాచారం ప్రకారం 7 ఏళ్ళలో ప్రధాని మోదీ భోజన ఖర్చు 100 కోట్లు దాటిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: RTI సమాచారం ప్రకారం 7 ఏళ్ళలో మోదీ భోజన ఖర్చు 100 కోట్లు దాటింది.

ఫాక్ట్ (నిజం): PMINDIA వెబ్సైటులో ప్రధానమంత్రి కిచెన్ కి, నెలవారీ కూరగాయలకి అయిన ఖర్చులకి సంబంధించి RTI ద్వారా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ‘ప్రధానమంత్రి వంటగది ఖర్చులు అనేవి ఆయన వ్యక్తిగత ఖర్చులని, ఈ ఖర్చులు ప్రభుత్వ ఎకౌంటు నుండి ఖర్చు చేయరని’ అని అన్నారు. పైగా మోదీ భోజన ఖర్చు 100 కోట్లు దాటిందని చెప్పే ఎటువంటి సమాచారం లేదు, ఇది కేవలం కల్పిత వార్త మాత్రమే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

PMINDIA వెబ్సైటులో ప్రధానమంత్రి మోదీకి సంబంధించి, ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి RTI ద్వారా సమాచారం కోరుతూ అడిగిన కొన్ని ప్రశ్నలు, వాటికి ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన సమాధానాలు అందుబాటులో ఉంచారు. ఐతే ఇందులో మోదీ భోజన ఖర్చులకి సంబంధించి RTI ద్వారా సమాచారం కోరినట్టు లేదు. కాకపోతే ప్రధానమంత్రి కిచెన్ కి, నెలవారీ కూరగాయలకి అయిన ఖర్చులకి సంబంధించిన అడిగిన ప్రశ్నలకి, ‘ప్రధానమంత్రి వంటగది ఖర్చులు అనేవి ఆయన వ్యక్తిగత ఖర్చులని, ఈ ఖర్చులు ప్రభుత్వ ఎకౌంటు నుండి ఖర్చు చేయరని’ సమాధానం ఇచ్చారు. ఇందులో ఎక్కడ కూడా, ప్రధాని భోజన ఖర్చు కి ఇంత అయింది అని చెప్పలేదు.

ఒకవేళ నిజంగానే మోదీ భోజన ఖర్చు 100 కోట్లని RTI ద్వారా వెలువడి ఉంటే, ఈ విషయాన్ని అన్ని వార్తా సంస్థలు ప్రచురించేవి. ఐతే ఈ విషయానికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు లేవు. సాధారణంగా ప్రతీ సంవత్సరం బడ్జెట్ లో ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) కూడా కొంత డబ్బు కేటాయిస్తారు, కాని ఈ కేటాయింపులలో ప్రత్యేకించి ప్రధానమంత్రి భోజనానికి ఇంతా అని కేటాయించరు. ఉదాహారణకి 2021-22 బడ్జెట్ లో ప్రధానమంత్రి కార్యాలయానికి 58 కోట్లు కేటాయించారు, 2020-21 సంవత్సరానికి ప్రధానమంత్రి కార్యాలయానికి 53.80 కోట్లు ఖర్చు చేసారు. ప్రధాన మంత్రి కార్యాలయ సిబ్బంది, మీటింగులు ఇతర ఖర్చులకు ఈ నిధులు వాడతారు. వీటన్నిటి బట్టి, ఏడేళ్ళలో మోదీ భోజన ఖర్చు 100 కోట్లన్నది కల్పిత వార్త అని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, ఏడేళ్ళలో మోదీ భోజన ఖర్చు 100 కోట్లు దాటిందన్నది ఒక కల్పిత వార్త.

Share.

About Author

Comments are closed.

scroll