Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ ద్వారపూడి రైల్వే స్టేషన్ నుండి తప్పిపోయిన అమ్మాయి కిడ్నాప్ అవలేదు

0

ఆంధ్రప్రదేశ్ ద్వారపూడి రైల్వే స్టేషన్ లో 13 సంవత్సరాల బాలిక కిడ్నాప్ అయినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ అమ్మాయి కుటుంబ సభ్యురాలు ఒకరు ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ద్వారపూడి రైల్వే స్టేషన్ లో 13 సంవత్సరాల బాలిక కిడ్నాప్ అయినట్టుగా షేర్ చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం):  21 జూన్ 2021 నాడు ద్వారపూడి రైల్వే స్టేషన్ లో తప్పిపోయిన అమ్మాయి కిడ్నాప్ అవలేదు. తన తాతాయ్యతో పాటు ద్వారపూడి రైల్వే స్టేషన్ కి వచ్చిన ఆ బాలిక, హైదరాబాద్ వెళ్ళడం ఇష్టంలేక రైల్వే స్టేషన్ నుండి తన తాతయ్యకు తెలవకుండా పారిపోయింది. రైల్వే స్టేషన్ నుండి పారిపోయిన ఆ బాలికని పోలీసులు అదే రోజు రాత్రి కనుగొన్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిచేలా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో కీ పదాలు ఉపయోగించి వెతికితే, ఆంధ్రప్రదేశ్ ద్వారపూడి రైల్వే స్టేషన్ లో అమ్మాయి తప్పిపోవడానికి సంబంధించి ‘ఈనాడు’ వార్త పత్రిక 23 జూన్ 2021 నాడు ఒక కథనం పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ద్వారపూడి రైల్వే స్టేషన్ లో తప్పిపోయిన బాలిక కిడ్నాప్ అవలేదని ఈ కథనంలో స్పష్టంగా తెలిపారు. వివరాలలోకి వెళితే, 21 జూన్ 2021 నాడు రాత్రి మండపేటకు చెందిన ఒక వ్యక్తి తన మనవరాలితో కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు ద్వారపూడి రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. హైదరాబాద్ వెళ్ళడం ఇష్టంలేక పోవడంతో మనవరాలు, తన తాతయ్యకు తెలవకుండా రైల్వే స్టేషన్ నుండి పారిపోయింది. ఆ అమ్మాయి కిడ్నాప్ అయ్యిందనే అనుమానంతో ఆమె కుటుంబ సభ్యురాలు ఒకరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

అయితే, ఆ అమ్మాయి తాతయ్య పోలీసు కేసు పెట్టడంతో, పోలీసులు అదే రోజు అమ్మాయి కోసం గాలింపులు చేపట్టారు.  తప్పిపోయిన ఆ  అమ్మాయిని ద్వారపూడి రైల్వే స్టేషన్ సమీపంలో అదే రోజు పోలీసులు కనుగొన్నట్టు ఈ కథనంలో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ ‘ABN ఆంధ్ర జ్యోతి’ వార్తాపత్రిక కూడా కథనం పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా ద్వారపూడి రైల్వే స్టేషన్ లో తప్పిపోయిన అమ్మాయి కిడ్నాప్ అవలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ ద్వారపూడి రైల్వే స్టేషన్ నుండి తప్పిపోయిన అమ్మాయి కిడ్నాప్ అవలేదు.

Share.

About Author

Comments are closed.

scroll