Fake News, Telugu
 

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సుమారు కోటి 18 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నది, 18 లక్షల చీరలు కాదు

0

ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న 18 లక్షల బతుకమ్మ చీరలకు రూ. 340 కోట్లు ఖర్చు అయ్యిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీన్ని బట్టి ఒక్కొక్క చీర సుమారు రూ.1,880 విలువైనదా అని ప్రశ్నిస్తూ మరొక  పోస్టుని కూడా షేర్  చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది పంపిణీ చేస్తున్న 18 లక్షల బతుకమ్మ చీరలకు రూ. 340 కోట్లు ఖర్చు అయిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనిని బట్టి ఒక్కో చీర ధర సుమారు 1880 రూపాయలుగా ఉంది.

ఫాక్ట్: ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదటి రోజు రాష్ట్రంలో 8 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నారు అని చెప్పారు. మరియు వార్తా కథనాల ప్రకారం ఈ ఏడాది తెలంగాణ మొత్తం కోటి నుంచి కోటి 18 లక్షల చీరలు పంపిణీ చేస్తారు. GHMC పరిధిలో 15.85 లక్షల చీరలు పంపిణీ ఉంటుంది. రాష్ట్రం మొత్తం పంపిణీ చేసే ఈ చీరలకు రూ. 340 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఒక్కో చీరకు షుమారు  రూ. 290 నుంచి రూ. 340 ఖర్చు అవుతుంది. కావున, ఈ పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా “V6 News” పేరుతో ఈ పోస్టు ప్రచారం అవుతుండడంతో మేము ఆ ఛానెల్‌కు సంబంధించిన వెబ్‌సైటు మరియు యూట్యూబ్ ఛానెల్‌ను పరిశీలించగా వాటిలో కూడా ఇదే వార్త ఉంది అని తెలుసుకున్నాము. సెప్టెంబర్ 23న బన్సిలాల్ పేటలో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పినట్లు తెలిసింది.  

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియోని చూడగా, చీరలు పంపిణీ చేసే ముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విధంగా అన్నారు, “ఇప్పటికే మన నియోజికవర్గానికి వచ్చేసరికి దగ్గర దగ్గర , రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల తొంభైవేలు, మన ఒక్క నియోజిక వర్గానికే సుమారు 52 వేలు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది”. దీనిని బట్టి మొదటి రోజు ఎన్ని చీరల పంపిణీ ఉంటుందో అని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. కానీ, “V6 News” వారు 18 లక్షల చీరలు అనేది రాష్ట్రం మొత్తానికా లేక కేవలం హైదరాబాద్ వరకేనా అనేది స్పష్టంగా చెప్పలేదు. అందువలన కొందరు ఈ సంఖ్యను  రాష్ట్రం మొత్తానికి అనుకోని ఒక్కొక్క చీర సుమారు 1,880 రూపాయల ధర ఉంటుంది అని లెక్క కట్టారు. ఇంకా పూర్తిగా బతుకమ్మ చీరలు పంపిణీ జరగనప్పటికీ, వివిధ వార్తా కథనాల ప్రకారం, ఈ ఏడాది షుమారు కోటి నుంచి కోటి 18 లక్షల చీరల పంపిణీ ఉంటుంది అని తెలుస్తుంది. వీటిలో GHMC పరిధిలో 15.85 లక్షల చీరలు పంపిణీ ఉంటుందని ఈ కథనాలు ద్వారా తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక్కో చీరకు సుమారు  రూ. 290 నుంచి రూ. 340 ఖర్చు అవుతుంది.  

2017 నుంచి ప్రభుత్వం ఎన్ని  బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందో ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, అస్పష్టమైన వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకొని బతుకమ్మ చీర ఒక్కొక్కదానికి రూ. 1,880 ఖర్చు అయ్యింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll