Fact Check, Telugu
 

నటరాజ్ పెన్సిల్స్/పెన్స్ ప్యాకింగ్ జాబ్స్ కల్పిస్తామంటూ షేర్ చేస్తున్న ఈ ప్రకటన ఫేక్

0

‘నటరాజ్ వారు పెన్సిల్/పెన్ ప్యాకింగ్ ఉద్యోగాలను అందిస్తున్నారు. నెలకు 30,000 జీతం తోపాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: నెలకు 30,000 జీతంతో నటరాజ్ వారు పెన్సిల్/పెన్ ప్యాకింగ్ ఉద్యోగాలను అందిస్తున్నారు.

ఫాక్ట్(నిజం): నటరాజ్ పెన్సిల్స్/పెన్స్ తయారు చేసే హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రై.లిమిటెడ్ సంస్థ పెన్సిల్స్/పెన్స్‌ ప్యాకింగ్ కోసం ఎటువంటి ఉద్యోగాలు కల్పించట్లేదు. వైరల్ అవుతున్న ఈ ప్రకటన ఒక స్కాం. ఇదే విషయం హిందుస్థాన్ పెన్సిల్స్ సంస్థ కూడా ఒక ప్రకటన ద్వారా తెలిపింది. తమ కంపెనీలో పెన్సిల్ ప్యాకేజింగ్ ప్రక్రియలో మానవ జోక్యం లేదని, యంత్రాల సహాయంతో పూర్తిగా ఆటోమేటెడ్ ప్యాకింగ్ చేయబడతాయని స్పష్టం చేస్తూ, ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని హెచ్చరించింది. పలు వార్తా కథనాలు కూడా ఇది ఫేక్ ప్రకటన అని నిర్దారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రై.లిమిటెడ్ అనే సంస్థ నటరాజ్, అప్సర మొదలైన బ్రాండ్స్ పేరుతో పెన్సిల్స్/పెన్స్ తయారు చేస్తుంది. ఐతే ఈ సంస్థ తాము మాన్యూఫ్యాక్చర్ చేసే పెన్సిల్స్/పెన్స్‌ ప్యాకింగ్ కోసం పోస్టులో చెప్తున్నట్టు ఎటువంటి ఉద్యోగాలు కల్పించట్లేదు. ఈ విషయానికి సంబంధించి సమాచారం కోసం గూగుల్‌లో వెతకగా  హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రై.లిమిటెడ్ ఇలాంటి ప్రకటనలు నమ్మవద్దని చెప్తూ రూపొందించిన ఒక వీడియో మాకు కనిపించింది.

సోషల్ మీడియాలో ఇలాంటి ప్రకటనలు షేర్ చేస్తున్నారని, కానీ తమ సంస్థ ఇలాంటి ఉద్యోగాలేవి కల్పించట్లేదని ఈ వీడియో ద్వారా స్పష్టం చేసింది. తమ కంపెనీలో పెన్సిల్ ప్యాకేజింగ్ ప్రక్రియలో మానవ జోక్యం లేదని, యంత్రాల సహాయంతో పూర్తిగా ఆటోమేటెడ్ ప్యాకింగ్ చేయబడతాయని స్పష్టం చేసారు. ఇలాంటి ప్రకటనల ద్వారా ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.

హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రై.లిమిటెడ్ సంస్థ తమ వెబ్‌సైట్‌ మరియు అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో కూడా ఈ విషయానికి సంబంధించి ఒక ప్రకటన జారీ చేసారు. గతంలో ఈ పెన్సిల్ ప్యాకింగ్ జాబ్స్ పేరుతో జరుగుతున్న స్కాం గురించి వార్తా కథనాలు కూడా రిపోర్ట్ చేసాయి. ఈ కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, నటరాజ్ పెన్సిల్స్/పెన్స్ ప్యాకింగ్ జాబ్స్ అంటూ షేర్ చేస్తున్న ఈ ప్రకటన ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll