ఇటీవల తైవాన్, జపాన్ దేశాలలో భారీ భూకంపం సంభవించింది. జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఐతే ఈ నేపథ్యంలో ఈ భూకంపాలకు సంబంధించినవి అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి (ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోలకు సంబంధించి నిజమేంటో తెలుసుకుందాం.
క్లెయిమ్: తైవాన్ మరియు జపాన్ దేశాలలో ఇటీవల సంభవించిన భారీ భూకంపానికి సంబంధించిన వీడియోలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలలో ఒకటి 2023లో టర్కీలో సంభవించిన భూకంపానికి సంబంధించింది కాగా మరొకటి 2022లో తైవాన్‌లో సంభవించిన భూకంపానికి సంబంధించింది. ఈ వీడియోలకు తైవాన్/జపాన్ ప్రస్తుత భూకంపానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
తైవాన్ సహా జపాన్ దక్షిణ ప్రాంతంలోని దీవులలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ నేపథ్యంలో ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలలో కొన్ని ఈ భూకంపానికి సంబంధించినవి కావు. ఈ వీడియోల గురించి కింద చూద్దాం.
ఈ వీడియోలోని దృశ్యాలు తైవాన్ భూకంపానికి సంబంధించినవే అయినప్పటికీ, ఇవి రెండేళ్ళ క్రితం 2022లో సంభవించిన భూకంపానికి సంబంధించినవి. ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోను 2022లో షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ మాకు కనిపించింది. ఈ పోస్ట్ ప్రకారం ఈ వీడియోలోని దృశ్యాలు 2022లో తైవాన్‌లో సంభవించిన భూకంపానికి సంబంధించినవి.
దీని ఆధారంగా వెతకగా, ఇవే దృశ్యాలను సెప్టెంబర్ 2022లో రిపోర్ట్ చేసిన తైవాన్ వార్తా కథనం మాకు కనిపించింది. హువాలియన్‌లోని “జువోక్సీ టౌన్‌షిప్” పర్వతారోహణ అసోసియేషన్‌కు చెందిన ఒక లెక్చరర్ తన విద్యార్థులతో కలిసి పర్వతం మీద ఉన్నప్పుడు, ఒక్కసారిగా భూమి కంపించింది. ఈ వీడియో ఆ సందర్భంలో తీసిందే. దీన్నిబట్టి ఈ వీడియోకు ప్రస్తుత భూకంపానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.
ఈ వీడియోలోని దృశ్యాలు గత సంవత్సరం టర్కీలో సంభవించిన భూకంపానికి సంబంధించినవి. ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోను గత సంవత్సరం రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం ఈ దృశ్యాలు ఫిబ్రవరి 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించినవని తెలిసింది.
ఇదిలా ఉండగా ఈ పోస్టులో షేర్ చేసిన మరో రెండు వీడియోలు ఇప్పుడు తైవాన్‌లో సంభవించిన భూకంపానికి సంబంధించినవే (ఇక్కడ & ఇక్కడ). కాగా ఈ వీడియోతో జపాన్ భూకంపానికి ఎటువంటి సంబంధం లేదు. ఐతే పలు తైవాన్‌కు సంబంధించినవే అయినప్పటికీ వీటితో పాటు పాత/సంబంధం లేని వీడియోలు షేర్ చేయడంతో భయాందోళనలకు గురయ్యే అవాకాశం ఉంది.
చివరగా, తైవాన్ భూకంపానికి సంబంధించిన వీడియోలు అంటూ సంబంధంలేని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు.