విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని ప్రశాంతి నగర్‌లో పగటిపూటే ఒక మహిళ ఎలివేటర్ (లిఫ్ట్)లో యువతికి మత్తుమందు ఇచ్చి దొంగతనం చేస్తున్న దృశ్యాలంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ వీడియోతో పాటు, “ప్రజలు ఇది గమనించి జాగ్రత్తగా ఉండాలంటూ, అలాగే తెలిసిన వాళ్ళకి, ఇతర గ్రూప్ లలో ఈ వీడియోను షేర్ చేస్తూ అందరికీ తెలిసేలా చెయ్యండి” అని చెప్తూ అదొక వాస్తవంగా జరిగిన ఘటనగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని ప్రశాంతి నగర్‌లో ఒక మహిళ పగటిపూటే ఎలివేటర్(లిఫ్ట్)లో యువతికి మత్తుమందు ఇచ్చి దొంగతనం చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు నిజమైన ఘటనకు సంబంధించినవి కావు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోని ‘EYE SPOT’ అనే యూట్యూబ్ ఛానెల్ 14 ఆగస్ట్ 2022 నాడు పబ్లిష్ చేసింది. ఈ వీడియోలో వివరణలో ఇది కేవలం ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్టు స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని ‘EYE SPOT’ అనే యూట్యూబ్ ఛానెల్ 14 ఆగస్ట్ 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో చూపించిన వివరణలో ఈ వీడియోని కేవలం ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్టు స్పష్టం చేశారు. ‘EYE SPOT’ పబ్లిష్ చేసిన మరిన్ని స్క్రిప్టెడ్ వీడియోలను ఇక్కడ చూడవచ్చు.
వైరల్ వీడియో మరియు ‘EYE SPOT’ పబ్లిష్ చేసిన వీడియోను పోలిస్తే రెండు ఒకే వీడియో అని అర్థమవుతుంది. దీన్ని బట్టి వైరల్ పోస్టులో చెప్తునట్టు ఈ ఘటన నిజమైనది కాదు, నటీనటులతో చిత్రీకరించింది అని నిర్థారించవచ్చు.
ఇటీవల కాలంలో ఇలాంటి పలు అవగాహన వీడియోలను నిజమైన ఘటనలంటూ షేర్ చేసిన పలు పోస్టులను ఫాక్ట్-చెక్ చేస్తూ FACTLY రాసిన కథనాలు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, పట్టపగలు లిఫ్ట్‌లో యువతికి మత్తుమందు ఇచ్చి దొంగతనం చేస్తున్న దృశ్యాలంటూ స్క్రిప్టెడ్ వీడియోను వాస్తవ ఘటనగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.