Fake News, Telugu
 

క్రైస్తవులను వేధిస్తే లేదా వారి పై దాడి చేస్తే, పదేళ్ల జైలు శిక్ష అని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వలేదు

0

ఎవరైనా మతం పేరుతో క్రైస్తవులను వేధిస్తే లేదా వారి పై దాడి చేస్తే, చేసినవారికి పదేళ్ల జైలు శిక్ష అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు, దేశంలోని క్రైస్తవుల కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ ఈ రోజు ప్రారంభించబడిందని చెప్తూ, ఒక ఫోన్ నెంబర్ – ‘18002084545’ ని కూడా షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  క్రైస్తవులను వేధిస్తే లేదా వారి పై దాడి చేస్తే, పదేళ్ల జైలు శిక్ష అని సుప్రీం కోర్టు తీర్పు. క్రైస్తవుల కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ (‘18002084545’) ఈ రోజు ప్రారంభం.

ఫాక్ట్: పోస్ట్ లో చెప్పిన తీర్పును సుప్రీం కోర్టు ఇచ్చినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఈ విషయం పై ఐపీసీ చట్టంలో మాత్రం కొన్ని సెక్షన్లు (153A, 295, 295A) ఉన్నాయి. కానీ, వాటి ప్రకారం గరిష్టంగా కొన్ని కేసుల్లో ఐదేళ్ళు శిక్ష మరియు జరిమానా ఉంది. నేషనల్ హెల్ప్‌లైన్ నెంబర్ – ‘1800-208-4545’ ని ‘యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం’ వారు 2015 లో మొదలు పెట్టారు; పోస్ట్ లో చెప్పినట్టు తాజాగా కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన తీర్పు గురించి వెతకగా, క్రైస్తవులను వేధిస్తే లేదా వారి పై దాడి చేస్తే, పదేళ్ల జైలు శిక్ష అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం దొరకలేదు. ఒకవేళ సుప్రీం కోర్టు నిజంగానే అలాంటి తీర్పు ఇస్తే, అన్నీ వార్తాసంస్థలు ఆ తీర్పు గురించి ప్రచురించేవి. కానీ, ప్రముఖ వార్తాసంస్థలు ఏవీ కూడా అలాంటి వార్తను ప్రచురించలేదు. అయితే, ఈ విషయం పై ఐపీసీ చట్టంలో ఉన్న సెక్షన్ల (153A, 295, 295A) కి సంబంధించిన వివరాలు కింద ఫోటోలో చదవొచ్చు. కానీ, వాటి ప్రకారం గరిష్టంగా కొన్ని కేసుల్లో ఐదేళ్ళు శిక్ష మరియు జరిమానా ఉంది.

అంతేకాదు,  ఇదే పోస్ట్ 2018 లో వైరల్ అయినప్పుడు, ‘యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం’ (United Christian Forum – UCF) వారు ‘బూమ్’ సంస్థ తో మాట్లాడుతూ, పోస్ట్ లో సుప్రీం కోర్టు తీర్పు గురించి ఉన్నది తప్పు అని, నేషనల్ హెల్ప్‌లైన్ నెంబర్ – ‘1800-208-4545’ ని మాత్రం తాము 2015 లో మొదలు పెట్టినట్టు తెలిపారు. హెల్ప్‌లైన్ నెంబర్ గురించి ‘ది హిందూ’ వార్తాపత్రిక 2015 లో ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. కాబట్టి, పోస్ట్ లో చెప్పినట్టు హెల్ప్‌లైన్ నెంబర్ ని ఈ మధ్య మొదలుపెట్టలేదు.

చివరగా, క్రైస్తవులను వేదిస్తే లేదా వారి పై దాడి చేస్తే, పదేళ్ల జైలు శిక్ష అని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వలేదు. నేషనల్ హెల్ప్‌లైన్ నెంబర్ – ‘1800-208-4545’ ని మాత్రం ‘యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం’ వారు 2015 లో మొదలు పెట్టారు.

Share.

About Author

Comments are closed.

scroll