కరోన వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త లాక్ డౌన్ నియమాలని పోలీసులు అనుసరిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. మహారాష్ట్ర లోని అమరావతి నగరంలో లాక్ డౌన్ నియమాలని ఉల్లంగించిన వారిని పోలీసులు లాఠీలతో కొడుతున్నారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కరోన వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు లాఠీలతో ప్రజలను కొడుతున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో మార్చ్ 2020 సమయంలో విధించిన లాక్ డౌన్ కి సంబంధించింది. మహారాష్ట్ర లోని అమరావతి నగరంలో, లాక్ డౌన్ నియమాలని ఉల్లంఘించిన వారిని పోలీసులు అప్పుడు ఇలా లాఠీలతో కొట్టారు. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్టులు దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోని చాలా మంది యూసర్లు మార్చ్ 2020 సమయంలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. లాక్ డౌన్ నియమాలని ఉల్లంగించిన వారిని పోలీసులు లాఠీలతో బాదుతున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. దీన్ని బట్టి, ఈ వీడియో మార్చ్ 2020లో విధించిన లాక్ డౌన్ కి సంబంధించిందని చెప్పవచ్చు.
ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Dainik Prabhat’ న్యూస్ సంస్థ 25 మార్చ్ 2020 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మహారాష్ట్ర లోని అమరావతి నగరంలో లాక్ డౌన్ నియమాలని ఉల్లంఘించిన వారిని పోలీసులు లాఠీలతో కొడుతున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఇదే విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ News 18 సంస్థ, ఈ వీడియోని తమ ఫేస్బుక్ పేజిలో షేర్ చేసింది.
కరోన వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట ప్రభుత్వం తమ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో మళ్ళీ లాక్ డౌన్ నియమాలని విధించింది. మహారాష్ట్ర ప్రభుత్వం అమరావతి నగరంలో 08 మార్చ్ 2021 వరకు లాక్ డౌన్ విధించింది. కానీ, పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఇటివల విధించిన లాక్ డౌన్ కి సంబంధించింది కాదు.
చివరగా, 2020 లాక్ డౌన్ సమయంలో తీసిన వీడియోని ఇటీవల మహారాష్ట్రలో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు లాఠీలతో ప్రజలను కొడుతున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.