Fake News, Telugu
 

రహదారిపై భారీగా నీరు పొంగుతున్న ఈ వీడియోలోని ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరగలేదు

0

మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని అసెగవ్ గ్రామంలో బావి తవ్వుతుండగా నీరు భారీగా బయటకి పొంగి అయిదుగురు కార్మికుల ప్రాణాలని బలిగొంది, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. రహదారిపై నీరు భారీగా పొంగుతున్న దృశ్యాలని ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని అసెగవ్ గ్రామంలో బావి తవ్వుతుండగా నీరు భారీగా పొంగిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. వీడియోలోని ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుందని పలు యూట్యూబ్ ఛానల్స్ ఈ వీడియోని 2017 నుండి షేర్ చేస్తున్నారు. కానీ, ఈ వార్తని దృవికరిస్తూ ఇంటర్నెట్‌లో మాకు ఎటువంటి న్యూస్ రిపోర్టులు దొరకలేదు. బావి తవ్వుతుండగా నీరు పొంగి కార్మికులు చనిపోయిన ఘటన ఏది ఇటీవల అమరావతి జిల్లాలో చోటుచేసుకోలేదని అమరావతి జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే,  ఇదే వీడియోని కనీసం 2017 నుండి పలు యూట్యూబ్ ఛానల్స్ షేర్ చేస్తున్నట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. వీడియోలోని ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లాలో చోటుచేసుకుందని ఈ యూసర్లు వీడియో వివరణలో తెలిపారు. రత్లాం జిల్లాలోని ఝార్ అనే గ్రామంలో బావి తవ్వుతుండగా నీరు భారీగా పొంగిన దృశ్యాలని ఒక యూసర్ వీడియో వివరణలో తెలిపారు. కాని, ఈ వార్తని దృవికరిస్తూ ఇంటర్నెట్‌లో మాకు ఎటువంటి న్యూస్ రిపోర్టులు దొరకలేదు. 2018లో ఇదే వీడియోని కొందరు యూసర్లు షేర్ చేస్తూ, ఈ ఘటన మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో చోటుచేసుకుందని తెలిపారు.

ఈ వీడియోకి సంబంధించి ‘న్యూస్ చెకర్’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ ఇటీవల అమరావతి జిల్లాను సంప్రదించారు. బావి తవ్వుతుండగా నీరు పొంగి కార్మికులు చనిపోయిన ఘటన ఏది ఇటీవల అమరావతి జిల్లాలో చోటుచేసుకోలేదని అమరావతి జిల్లా కలెక్టర్ వారికి స్పష్టం చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోలేనప్పటికి, మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఇలాంటి ఘటనలేవి ఇటీవల చోటుచేసుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, రహదారిపై  నీరు భారీగా పొంగుతున్న ఈ వీడియోలోని ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరగలేదు.

Share.

About Author

Comments are closed.

scroll