Fake News, Telugu
 

తమిళనాడు రైతులు కావేరి నదికి స్వాగతం పలుకుతున్న పాత వీడియోని సంవత్సరంలో నెల రోజులు మాత్రమే ప్రవహించే నది దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

కావేరి నది పిత్రు అమావాస్య రోజు నుండి దీపావళి అమావాస్య రోజు వరకు మాత్రమే ప్రవహించి ఆ మరుసటి తెల్లవారుజామున కనిపించకుండా పోతుందని సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. వాగులోకి నీరు చేరుతుండగా జనాలు సాష్టాంగ నమస్కారం  చేస్తూ నది ప్రవాహానికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ప్రకృతి అద్భుత చమాత్కారం కారణంగానే కావేరి నది సంవత్సరంలో ఒక్క నెల రోజులు మాత్రమే ప్రవహిస్తుందని, అందుకే కావేరి నదిని దక్షిణగంగ అని పిలుస్తారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: కావేరి నది పిత్రు అమావాస్య నుండి దీపావళి అమావాస్య మధ్య నెల రోజులు మాత్రమే ప్రవహిస్తుంది.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2017లో తమిళనాడు మయిలాడుతురై జిల్లా ప్రజలు కావేరి నదికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలని చూపిస్తుంది. 2017లో ‘కావేరి మహాపుష్కరం’ వేడుక సందర్భంగా తమిళనాడు మెట్టూరు డ్యాం నుండి కావేరి జలాలని మయిలాడుతురై జిల్లాకు వదిలారు. ‘కావేరి మహాపుష్కరం’ వేడుకని తమిళనాడు ప్రజలు 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. తమిళనాడు రైతులు కావేరి నదిని దేవతలా కొలుస్తారన్న మాట వాస్తవమే అయినప్పటికీ, కావేరి నది సంవత్సరంలో ఒక్క నెల రోజులు మాత్రమే ప్రవహిస్తుందనే మాటలో నిజం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలు సోషల్ మీడియాలో 2017 నుండి షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కావేరి జలాలు తమిళనాడు మయిలాడుతురై జిల్లాకు చేరుకుంటున్న దృశ్యాలంటూ యూసర్లు తమ వీడియో వివరణలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా  పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఈ వీడియోని ‘One India Tamil’ న్యూస్ వెబ్సైటు 19 సెప్టెంబర్ 2017 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. తమిళనాడు మయిలాడుతురై జిల్లా ప్రజలు కావేరి నదికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలని ఈ ట్వీట్లో తెలిపారు.

‘One India Tamil’ న్యూస్ సంస్థ ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది. ‘కావేరి మహాపుష్కరం 2017’ వేడుక సందర్భంగా తమిళనాడు మెట్టుర్ డ్యామ్ నుండి కావేరి ఒడ్డు ప్రాంతాలకు జలాలని విడిచినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ ఆర్టికల్‌లో తెలిపిన సమాచారం ప్రకారం, ‘కావేరి మహాపుష్కరం’ వేడుకని తమిళనాడు ప్రజలు 12 నుండి 24 సెప్టెంబర్ 2017 మధ్య జరుపుకున్నారు. కావేరి జలాలు మయిలాడుతురై జిల్లాలో ప్రవేశిస్తున్న సమయంలో ‘కావేరి మహాపుష్కరం’ నిర్వాహకులు, మయిలాడుతురై రైతులు కావేరి నదికి నమస్కరించి స్వాగతం పలికినట్టు ఆర్టికల్‌లో తెలిపారు. 144 సంవత్సరాలు కరువుతో బాధపడిన మయిలాడుతురై రైతులు, కావేరి జలాలు ప్రవేశిస్తున్న ఆనందంలో కావేరి నదికి నమస్కరించి దేవతలా కొలిచారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.     

‘India.com’ న్యూస్ వెబ్సైటు రిపోర్టులో తమిళనాడు ప్రజలు ‘కావేరి మహాపుష్కరం’ వేడుకని పన్నెండు (12) సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకుంటారని తెలిపారు. 2019లో ‘Milaap’ క్రౌడ్‌ఫండింగ్ వెబ్సైటు పబ్లిష్ చేసిన ఒక వీడియోలో, కావేరి జలాల కొరత వలన తమిళనాడు రైతులు అనుభవిస్తున్న కష్టాలను ఒక యువ రైతు వివరించారు. తమిళనాడులోని చాలా ప్రాంతాలలో గత మూడు సంవత్సరాలుగా కావేరి నది జలాలు ప్రవేశించలేదని ఆ రైతు వీడియోలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా కావేరి నది సంవత్సరంలో ఒక్క నెల రోజులు మాత్రమే ప్రవహిస్తుందనే వార్తలో నిజం లేదని స్పష్టమయ్యింది.

చివరగా, కరువుతో బాధపడుతున్న తమిళనాడు రైతులు కావేరి నదికి స్వాగతం పలుకుతున్న వీడియోని ప్రకృతి చమత్కారం కారణంగా కావేరి నది సంవత్సరంలో ఒక్క నెల రోజులు మాత్రమే ప్రవహిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll