“మాల్దీవుల నుంచి భారత్ 28 దీవులను కొనుగోలు చేసింది. మాల్దీవులు తన 28 దీవులను భారతదేశానికి అప్పగించింది. అధ్యక్షుడు ముయిజు స్వయంగా ఒప్పందంపై సంతకం చేశారు” అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒక పోస్టు షేర్ చెయ్యబడుతోంది. దీని వెనుక ఎంత వాస్తవం ఉందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: మాల్దీవుల నుంచి భారత్ 28 దీవులను కొనుగోలు చేసింది. మాల్దీవులు తన 28 దీవులను భారతదేశానికి అప్పగించింది. అధ్యక్షుడు ముయిజు స్వయంగా ఒప్పందంపై సంతకం చేశారు.
ఫాక్ట్(నిజం): ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాల్దీవ్స్‌లో దీవులు కొన్నట్టు ఎటువంటి రిపోర్టులు లేవు. కానీ, భారత ప్రభుత్వం ఇటీవల (ఆగస్ట్ 2024) మాల్దీవులలో నీరు మరియు పారిశుద్ధ్య ప్రాజెక్ట్ కోసం నిధులు సమకూరుస్తూ ఆ ప్రాజెక్టును ప్రారంభించింది. మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ కూడా తన X పోస్ట్‌లో భారతదేశానికి 28 దీవుల్లో వాటర్ అండ్ సీవేజ్ ప్రాజెక్ట్‌ను అప్పగించినట్లు పోస్టు చేసారు. భారత ప్రభుత్వ PIB ఫాక్ట్ – చెక్ సంస్థ కూడా ఇది ఫేక్ వార్త అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ఈ పోస్టు గురించి తెలుసుకునేందుకు తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాల్దీవ్స్‌లో 28 దీవులు కొన్నట్టు ఎటువంటి అధికారిక రిపోర్టు మాకు లభించలేదు. కానీ, భారతదేశం నీరు మరియు పారిశుద్ధ్య ప్రాజెక్టును మాల్దీవులకు చెందిన 28 దీవులలో ప్రారంభించినట్టు పలు వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).
ఈ నివేదికల ప్రకారం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ 10 ఆగష్టు 2024న మాల్దీవులకు భారీ నీరు మరియు పారిశుద్ధ్య ప్రాజెక్టును అందజేశారు. భారతదేశం నిధులు సమకూర్చిన ఈ ప్రాజెక్ట్ (సుమారు రూ. 923 కోట్లు) 28 ద్వీపాలకు ప్రయోజనం చేకూరుస్తుంది, అక్కడి దేశ జనాభాలో 7% మందిని కవర్ చేస్తుంది. ఇది ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇండియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ కింద ప్రారంభించబడింది.

దీని గురించి మరింత వెతికితే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 11 ఆగస్ట్ 2024న ఒక పత్రికా ప్రకటనలో, “ప్రెసిడెంట్ ముయిజ్జూ సమక్షంలో రాష్ట్రపతి కార్యాలయంలో, EAM మరియు విదేశాంగ మంత్రి సంయుక్తంగా ప్రారంభించారు, భారతదేశం యొక్క లైన్ ఆఫ్ క్రెడిట్ (LoC) అసిస్ట్ చెయ్యబడ్డ project of water and sewerage networkను మాల్దీవుల యొక్క 28 దీవుల్లో ప్రారంభించారు” అని పేర్కొనడం గమనించాం.

ఈ సమావేశాన్నీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో ““Virtual Inauguration of Water and Sanitation Projects in 28 Islands of Maldives” అనే శీర్షికతో అప్లోడ్ చేసింది. విదేశాంగ మంత్రి, ఎస్.జయశంకర్ దీని గురించి Xలో పోస్టు చేసారు. అంతే కాకుండా మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ కూడా తన X పోస్ట్‌లో భారతదేశానికి 28 దీవుల్లో వాటర్ అండ్ సీవేజ్ ప్రాజెక్ట్‌ను అప్పగించినట్లు పోస్టు చేసారు.
భారత ప్రభుత్వ PIB ఫాక్ట్ – చెక్ సంస్థ కూడా ఇది ఫేక్ వార్త అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
చివరిగా, మాల్దీవుల నుంచి భారత్ 28 దీవులను కొనుగోలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు, ఇది ఫేక్ వార్త.