Fake News, Telugu
 

ఈ ఫోటోలో అఖిలేష్ యాదవ్ విలాసవంతంగా కూర్చున్న సోఫాలను సమాజ్‌వాది పార్టీ అమర్చలేదు

0

సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు సోఫాలు కూడా తీసుకెళ్తున్నారు, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. గోడలకి ప్లాస్టరింగ్ కూడా వేయించని ఒక ఇంట్లో, అఖిలేష్ యాదవ్ విలాసంతమైన సోఫాలో కూర్చున్న దృశ్యాలని ఈ ఫోటోలో చూడవచ్చు. 2022లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యోక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు సోఫాలు తీసుకెళ్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో, అఖిలేష్ యాదవ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటావ జిల్లాలో డెంగ్యుతో చనిపోయిన ఒక భాదిత కుటుంబాన్ని పరామర్శించినప్పుడు తీసారు. గిజా గ్రామానికి చెందిన ముఖేష్ బాతమ్ అనే వ్యక్తి ఇటీవల డెంగ్యు కారణంగా తన కొడుకుని కోల్పోయాడు. అఖిలేష్ యాదవ్ 03 నవంబర్ 2021 నాడు అఖిలేష్ యాదవ్ ముఖేష్ బాతమ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న సోఫాలు తనవే అని, ఇటీవల తన ఇద్దరి కొడుకుల వివాహాలలో ఈ సోఫా సెట్లని కానుకలగా ఇచ్చినట్టు ముఖేష్ బాతమ్ మీడియాకి స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఈ ఫోటోని అఖిలేష్ యాదవ్ స్వయానా తన ట్విట్టర్ అకౌంట్లో 03 నవంబర్ 2021 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోని అఖిలేష్ యాదవ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ ఇటావ జిల్లాలో డెంగ్యుతో చనిపోయిన ఒక భాదిత కుటుంబాన్ని పరమర్శించినప్పుడు తీసినట్టు తెలిసింది. డెంగ్యు వ్యాధి కారణంగా ఇటావ జిల్లాలోని గ్రామాలలో అధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైద్య సౌకర్యాలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.  

ఈ సోఫాలకి సంబంధించిన అసలు సమాచారాన్ని వివరిస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. గిజా గ్రామంలో డెంగ్యు కారణంగా కొడుకుని కోల్పోయిన ముఖేష్ బాతమ్ కుటుంబాన్ని అఖిలేష్ యాదవ్ 03 నవంబర్ 2021 నాడు పరామర్శించినట్టు ఈ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేసారు. తన ఇంట్లోని సోఫాలపై చెలరేగిన వివాదం గురించి ముఖేష్ బాతమ్ మీడియాకు స్పష్టత ఇచ్చినట్టు ఆర్టికల్స్‌లో తెలిపారు. ముఖేష్ బాతమ్ మీడియాతో తనకు నలుగురు కుమారులు ఉన్నారని, వారిలో ఇద్దరికి ఇటీవలే వివాహమైందని చెప్పారు. కుమారుల వివాహలలో ఈ రెండు సోఫాసెట్లను కానుకలగా ఇచ్చారని, అఖిలేష్ యాదవ్ షేర్ చేసిన ఫోటోలలో కనిపిస్తున్న సోఫా సెట్ తనదేనని ముఖేష్ బాతమ్ మీడియాకి స్పష్టం చేసారు. ఈ వివరాల ఆధారంగా ఫోటోలో కనిపిస్తున్న సోఫాలు సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు అమర్చినవి కావని చెప్పవచ్చు.

చివరగా, ఈ ఫోటోలో అఖిలేష్ యాదవ్ కూర్చున్న విలాసవంతమైన సోఫాలను సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు అమర్చలేదు.

Share.

About Author

Comments are closed.

scroll