Fake News, Telugu
 

2017లో వర్షాల వల్ల మెక్సికోలోని ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై వరదనీరు చేరిన వీడియోని చెన్నై ఎయిర్‌పోర్ట్‌దంటూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నైలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై వరదనీరు చేరడంతో కొన్ని ఫ్లైట్స్ కూడా రద్దు చేసారు. ఐతే ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే నీటితో నిండి ఉన్న ఒక వీడియోని చెన్నై ఎయిర్‌పోర్ట్‌దని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: చెన్నై ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే నీటితో నిండిపోయిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది మెక్సికో సిటీ ఎయిర్‌పోర్ట్‌. ఈ వీడియో 2017లో మెక్సికోలో వర్షాల వల్ల మెక్సికో సిటీ ఎయిర్‌పోర్ట్‌ (Aeropuerto Internacional Benito Juárez) ఎయిర్‌పోర్ట్‌పై నీరు చేరినప్పుడు తీసింది. చాలా మెక్సికన్ వార్తా సంస్థలు ఈ వీడియోని రిపోర్ట్ చేసాయి. ప్రస్తుతం చెన్నైలో కురుస్తున్న వర్షాల వల్ల విమానయాన సేవలకు అంతరాయం కలిగినప్పటికీ, ఈ వీడియోకి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి ఎటువంటి సంబంధంలేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోలో కనిపిస్తున్నది మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానశ్రయం. ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2017లో ఇదే వీడియోని మెక్సికో సిటీ ఎయిర్‌పోర్ట్‌ (Aeropuerto Internacional Benito Juárez)  దంటూ షేర్ చేసిన పోస్టు కనిపించింది.

దిని ఆధారంగా గూగుల్‌లో వెతకగా 2017లో వర్షాల వల్ల మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానశ్రయంలో విమాన సర్వీసులు రద్దు చేసారని చెప్తూ ఒక మెక్సికో వార్తా సంస్థ ఇదే వీడియోని షేర్ చేసిన ట్వీట్ మాకు కనిపించింది.

ఇదే వీడియోని మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానశ్రయానిదని రిపోర్ట్ చేసిన మరొక మెక్సికన్ వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి, ఈ వీడియో మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానశ్రయానిదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఐతే ప్రస్తుత వరదలకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌ కూడా కొన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ కూడా ఇదే విషయం చెప్తూ 11 నవంబర్ 2021 మధ్యాహ్నం ఒక ట్వీట్ చేసింది. ఐతే సాయంకాలం ఎయిర్‌పోర్ట్‌ సర్వీసు పునఃప్రారంభం అయినట్టు మరొక ట్వీట్ చేసింది.

వరదల వల్ల చెన్నై విమానశ్రయంలో విమాన సర్వీసులకు ఆటంకం కలిగినప్పటికీ వైరల్ అవుతున్న వీడియో చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి సంబంధంలేదు. గతంలో కూడా  ఇదే వీడియోని ప్రపంచంలోని వివిధ నగరాలలోని (సింగపూర్, ముంబై, బెంగళూరు, మియామీ, హైదరాబాద్) విమానాశ్రయాలకి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసారు. అది మెక్సికోకి సంబంధించిన వీడియో అని వివిధ మీడియా సంస్థలు ప్రచురించిన ఫ్యాక్ట్-చెక్ కథనాలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, 2017లో వర్షాల వల్ల మెక్సికోలోని ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై వరదనీరు చేరిన వీడియోని చెన్నై ఎయిర్‌పోర్ట్‌దంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll