Fake News, Telugu
 

1966లో పార్లమెంట్ వెలుపల గోహత్య నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు, వందల/వేల సంఖ్యలో కాదు

0

07 నవంబర్ 1966న పార్లమెంట్ వెలుపల గోహత్యను నిషేధించాలని నిరసన చేస్తున్న సాధువులపై ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అధికారికంగా 375 హిందువులు చనిపోయారని, అదే అనధికారికంగా ఐతే సుమారు 5000 మంది చనిపోయారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 1966లో పార్లమెంట్ వెలుపల ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అధికారికంగా 375, అనధికారికంగా 5000 మంది చనిపోయారు.

ఫాక్ట్ (నిజం): ప్రభుత్వం గోహత్యను నిషేధించాలని 07 నవంబర్ 1966న పార్లమెంట్ వెలుపల నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపిన మాట నిజమే అయినప్పటికీ, ఈ ఘటనలో వందలు లేదా వేల సంఖ్యలో జనాలు చనిపోలేదు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయినట్టు పార్లమెంట్‌లో మంత్రులు, వార్తా కథనాలు, అధికారిక పత్రాలు పేర్కొన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

07 నవంబర్ 1966న ఢిల్లీలో  ప్రభుత్వం గోహత్యను నిషేధించాలని కోరుతూ జన్ సంఘ్, హిందూ మహాసభ, ఆర్య సమాజ్, సనాతన్ ధర్మ సభ ఆద్వర్యంలో గోరక్షకులు, సాధువులు నిరసనలు తెలుపుతూ  పార్లమెంట్ వైపుకు కవాతుగా బయలుదేరారు. ఐతే నిరసనకారులు పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిచడంతో పోలీసులు వారిపై ఫైరింగ్ చేయగా, ఈ ఫైరింగ్‌లో కొందరు నిరసనకారులు చనిపోయారు.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో, లోక్‌సభలో అప్పటి హోం శాఖా మంత్రి అయిన గుల్జారీలాల్ నంద పార్లమెంట్ వెలుపల జరిగిన పరిణామాలను సభలో వివరించారు. ‘జనసంఘ్ పార్టీ ఎంపీ స్వామి రామేశ్వరానంద రెచ్చగొట్టే ఉపన్యాసం ఇవ్వడంతో నిరసనకారులు పార్లమెంట్ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఫైరింగ్ చేయగా, ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం కనీసం ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇప్పటివరకి ఇద్దరు మృతి చెందినట్లు’ హోం మినిస్టర్ సభకు 07 నవంబర్ 1966న వివరించారు.

అదే రోజు రాజ్యసభలో సభ్యులైన అటల్ బిహారి వాజ్‌పేయి తదితర సభ్యులు హోం మంత్రి వచ్చి జరిగిన పరిణామాలు వివరించాలని కోరడంతో, హోం మంత్రిత్వ శాఖలో మినిస్టర్ అఫ్ స్టేట్ అయిన శ్రీ జైసుఖ్‌లాల్ హథీ రాజ్యసభలో జరిగిన ఘటనకు సంబంధించి ఇచ్చిన వివరణలో కూడా పైన తెలిపిన విషయాన్నే పునరుద్ఘాటించారు.

ఐతే 08 నవంబర్ 1966న జరిగిన లోక్‌సభ సమావేశంలో ముందు రోజు జరిగిన పోలీస్ ఫైరింగ్ అంశంపై రామ్ మనోహర్ లోహియా, మొదలైనవారు ప్రవేశపెట్టిన  వాయిదా తీర్మానంలో పోలీస్ ఫైరింగ్‌లో ఏడుగురు చనిపోయారని, వంద మందికిపైగా గాయపడ్డారని పేర్కొన్నారు. కాగా ఈ ఘటన జరిగిన తర్వాతి రోజుల్లో జరిగిన లోక్‌సభ (ఇక్కడ మరియు ఇక్కడ) మరియు రాజ్యసభ (ఇక్కడ మరియు ఇక్కడ)  చర్చల్లో ఎక్కడా కూడా ఈ ఘటనలో పోస్టులో చెప్తున్నట్టు వందల సంఖ్యలో నిరసనకారులు చనిపోయారని పేర్కొనలేదు.

ఐతే ఈ ఘటన జరిగిన తర్వాతి రోజు (08 నవంబర్ 1966) ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పోలీస్ ఫైరింగ్‌లో ఏడుగురు చనిపోగా, 200 మంది గాయపడ్డారని రిపోర్ట్ చేసింది. ది హిందూ పత్రిక కూడా ఈ ఘటనకు సంబంధించి ప్రచురించిన కథనంలో పోలీస్ ఫైరింగ్‌లో ఏడుగురు చనిపోయినట్టు 08 నవంబర్ 1966న రిపోర్ట్ చేసింది.

ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ ఆ తరవాతి రోజు (09 నవంబర్ 1966)న  పోలీస్ ఫైరింగ్‌లో మరొకరు చనిపోయారని రిపోర్ట్ చేసింది. దీనితో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రచురించిన వార్తా కథనాలలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) కూడా ఎనిమిది మందికి మించి చనిపోయినట్టు పేర్కొనలేదు. దీన్ని బట్టి పోస్టులో చెప్తునట్టు ఈ ఘటనలో వందలు, వేల సంఖ్యలో జనాలు చనిపోయారన్న వార్త వాస్తవం కాదని అర్ధమవుతుంది.

చివరగా, 1966లో పార్లమెంట్ వెలుపల గోహత్య నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు, వందలు/వేల సంఖ్యలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll