టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి RBI జనవరి 2023 నుండి కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొచ్చిందని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి ఆటో రెన్యూవల్ సదుపాయాన్ని RBI కొత్త నిబంధనల ద్వారా తొలగించిందని కూడా ఈ వీడియోలో పేర్కొంటున్నారు. ఐతే ఈ కథనం ద్వారా వీడియోలో చెప్తున్నదాంట్లో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి RBI జనవరి 2023 నుండి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది.
ఫాక్ట్(నిజం): టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి మెచ్యూరిటీ కాలం దాటినా కూడా క్లెయిమ్ చేయబడని/ఓవర్ డ్యూ ఉన్న మొత్తానికి వడ్డీ రేట్లను సవరిస్తూ RBI నిబంధనలు తీసుకొచ్చిన మాట నిజమే అయినప్పటికీ ఈ నిర్ణయం కొత్తదేమీ కాదు. 2021 జులైలోనే RBI ఈ నిబంధనను తీసుకొచ్చింది. అలాగే టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి ఆటో రెన్యూవల్ సదుపాయం ప్రస్తుతం కూడా అందుబాటులోనే ఉంది. RBI ఈ నిబంధనను తీసేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియోలో చెప్తునట్టుగా టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి మెచ్యూరిటీ కాలం దాటినా కూడా క్లెయిమ్ చేయబడని/ఓవర్ డ్యూ ఉన్న మొత్తానికి వడ్డీ రేట్లను సవరిస్తూ RBI నిబంధనలు తీసుకొచ్చిన మాట నిజమే అయినప్పటికీ ఈ నిర్ణయం కొత్తదేమీ కాదు. RBI 2021 జులైలోనే ఈ నిబంధనను తీసుకొచ్చింది. అప్పటినుండి ఈ నిబంధన అమలులో ఉంది. RBI జులై, 2021లో ఈ నిబంధనను తీసుకొస్తూ విడుదల చేసిన సర్కులర్ ఇక్కడ చూడొచ్చు.
అంతకుముందు మెచ్యూరిటీ తర్వాత క్లెయిమ్ చేయబడని/ఓవర్ డ్యూ ఉన్న మొత్తానికి సేవింగ్స్ డిపాజిట్లకు వర్తించే వడ్డీరేటు వర్తించేది. కానీ కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తరవాత ఈ మొత్తంపై కాంట్రాక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ లేదా సేవింగ్స్ డిపాజిట్ వడ్డీ రేట్లలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని అందిస్తారు.
టర్మ్ డిపాజిట్‌ల ఆటో రెన్యూవల్ సదుపాయం తీసేసారా?
వైరల్ వీడియోలో టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి ఆటో రెన్యూవల్ సదుపాయం తొలగించారని చెప్తున్నారు. కానీ, RBI అలాంటి నిబంధనేదీ తీసుకొచ్చినట్టు సమాచారం లేదు. ప్రస్తతం బ్యాంకులు టర్మ్ డిపాజిట్‌లను ఆటో రెన్యూవల్ చేసుకొనే సదుపాయం అందిస్తున్నాయి. వినియోగదారుడు టర్మ్ డిపాజిట్ చేసే సమయంలో ఆటో రెన్యూవల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
చివరగా, మెచ్యూరిటీ కాలం దాటినా కూడా క్లెయిమ్ చేయబడని మొత్తానికి వడ్డీ రేట్లను సవరిస్తూ RBI తీసుకొచ్చిన నిబంధన కొత్తదేమీ కాదు.