Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌ భూతవైద్యం వీడియోని పాకిస్థాన్‌లో ఒక హిందూ మహిళను బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్న దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

పాకిస్థాన్ లో హిందూ యువతిని తీవ్రంగా కొట్టిన తర్వాత దెబ్బలకు ఓర్చుకోలేక ఆమె మతం మారుతానని ఒప్పుకున్న తర్వాత  చేతికున్న కట్లు ఊడదీసి ఇకనుంచి ముస్లిం గా బతుకుతానని ప్రతిజ్ఞ చేయించి ఎలా మతం మారుస్తున్నారో చూడండి’, అని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: పాకిస్థాన్‌లో ఒక హిందూ యువతిని ఇస్లాం మతంలోకి మారుస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్: వీడియోలోని దృశ్యాలు బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం యువతికి భూతవైద్యం చేస్తున్నవి . ఒక జిన్ (దెయ్యం)ను ఒక ముస్లిం యువతి శరీరంలో నుంచి పారద్రోలడానికి ఇలా భూత వైద్యులు చేస్తారు. అందుకే పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులోని క్లెయిమ్ గురించి మరింత సమాచారం కోసం సరైన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇండియా టుడే ఫాక్ట్ చెక్ వారు ఇదే వీడియోపై 2019లో రాసిన ఆర్టికల్ లభించింది. ఇదే వీడియో 2019లో బంగ్లాదేశ్‌లో హిందువులను ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చుతున్నారు అని వైరల్ (ఇక్కడ) అయినప్పుడు, వారు ఇది భూతవైద్యం చేస్తున్నప్పుడు చిత్రించిన వీడియోగా రుజువు చేసారు.

ఇంకొన్ని కీ వర్డ్స్ ఉపయోగించి ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ కొరకు వెతకగా, యూట్యూబ్లో 12.22 సెకండ్ల నిడివి వీడియో ఉన్న అనేక పోస్టులు కనిపించాయి. వైరల్ పోస్టులో  ఇందులోని ఒక భాగాన్ని మాత్రం పోస్టు చేసారు. ఆ వీడియోని మీరు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. బెంగాలీ భాషలో ఈ వీడియోల టైటిల్స్ ఉన్నాయి. ‘పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్’ అనే ఛానెల్ వారు అప్లోడ్ చేసిన వీడియో టైటిల్ ఇంగ్లీష్ అనువాదం మీరు కింది స్క్రీన్ షాట్‌లో  చూడవచ్చు.

బంగ్లాదేశ్‌ దేశపు ఫాక్ట్ చెకింగ్ వెబ్సైటు ‘Rumour Scanner’ వారు ఈ వీడియోపై ఒక ఫాక్ట్ చెక్ ఆర్టికల్ రాస్తూ, ఒక ముస్లిం అమ్మాయి నుండి ‘జిన్’ను పారద్రోలడానికి భూతవైద్యం చేస్తున్న దృశ్యాలని నిర్ధారించారు. వీడియోలో మాటలను విశ్లేషించి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ‘Rumour Scanner‘ వారు రాసిన ఈ ఆర్టికల్ మీరు ఇక్కడ చదవచ్చు. వైరల్ వీడియోలో మాదిరిగానే జిన్ భూతాన్ని పారదోలడానికి చేసిన భూతవైద్యం (exorscism) వీడియోలు యూట్యూబ్‌లో అనేకం ఉన్నాయి. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు.

బంగ్లాదేశ్‌లో చిత్రించిన ఈ భూతవైద్యం వీడియోని పాకిస్థాన్‌లో ఒక హిందూ మహిళను బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్న దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll