వెంటిలేటర్ పై ‘PM CARES’ రాసి ఉన్న ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తూ, అది ఒక ఎడిటెడ్ ఫోటో అని, ఒరిజినల్ ఫోటో లో ‘PM CARES’ అని రాసి లేదని చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వెంటిలేటర్ పై ‘PM CARES’ అని రాసి లేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో.
ఫాక్ట్ (నిజం): ): పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న వెంటిలేటర్ కి సంబంధించిన వేరే ఫోటోల్లో మరియు వీడియోలో వెంటిలేటర్ పై ‘PM CARES’ అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. ఈ వెంటిలేటర్ ‘PM CARES’ నిధులతో కొన్నదే. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ చేసిన ఫోటోల్లో వెంటిలేటర్ పై ‘PM CARES’ అని ఫోటోషాప్ చేసి ఎడిట్ చేయబడిందని పోస్ట్ చేసారు. అయితే, ఫోటోషాప్ సహాయంతో వెంటిలేటర్ పై ‘PM CARES’ అని లేకున్నా, ‘PM CARES’ అని పెట్టవచ్చనేది ఎంత నిజమో, ‘PM CARES’ అని రాసున్నా, దానిని తీసేయవొచ్చనేది కూడా అంతే నిజం (ఎలా తీసేయవొచ్చో కింద గిఫ్ లో చూడవొచ్చు). కాబట్టి, కేవలం పోస్ట్ చేసిన ఫోటోలు చూసి, ఏది నిజమో ఏది అబద్దమో చెప్పలేము.
ఫోటోలోని వెంటిలేటర్ పై ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ మరియు ‘స్కాన్రే’ కంపెనీ లోగో ఉన్నట్టు చూడవొచ్చు. అవే కంపెనీ లోగోలు ఉన్న వెంటిలేటర్లను చూపిస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వేరే ఫోటోల్లో కూడా వెంటిలేటర్ల పై ‘PM CARES’ అని రాసి ఉన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
అంతేకాదు, ‘PM CARES’ నిధుల ద్వారా సూరత్ నగరానికి 25 వెంటిలేటర్లు వచ్చాయి అని సూరత్ ఎంఎల్ఏ మరియు బీజేపీ నేత హర్ష్ సంఘవి పెట్టిన వీడియోలో కూడా వెంటిలేటర్లపై ‘PM CARES’ అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. కావున, వెంటిలేటర్ల పై నిజంగానే ‘PM CARES’ అని రాసి ఉన్నాయి. ఒక డాక్టర్ కూడా ఆ వెంటిలేటర్లు ప్రభుత్వ ఆర్డర్ లో భాగంగా తయారీ అవుతున్నాయని ట్వీట్ చేసాడు.
‘మేక్ ఇన్ ఇండియా’ కింద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు స్కాన్రే (ఫోటోలో ఉన్న వెంటిలేటర్ పై ఉన్న కంపెనీ లోగో) కి 30,000 వెంటిలేటర్ల కి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పటికే మొదటి విడతలో 3000 దేశీయ వెంటిలేటర్లను రాష్ట్రాలకు పంపిణీ చేసామని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపినట్టు ‘ANI’ సంస్థ ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. కాబట్టి ఈ వెంటిలేటర్లు ‘PM CARES’ నిధులతో కొన్నవే.
చివరగా, వెంటిలేటర్ పై ‘PM CARES’ అని నిజంగానే రాసి ఉంది, ఎడిటెడ్ ఫోటో కాదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?