కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సీటులో కూర్చున్నాడని రాహుల్ గాంధీ ఆయన్ని లేపి పంపించేశారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: తన సీటులో కూర్చున్నందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని లేపి పంపించేసిన రాహుల్ గాంధీ.
ఫాక్ట్: ఇది అవాస్తవం. పూర్తి వీడియో ప్రకారం, మల్లికార్జున ఖర్గే ప్రసంగానికి వెళ్లడానికి వీలుగా రాహుల్ గాంధీ లేచి ఖర్గే కుర్చీని వెనక్కి లాగారు. తర్వాత రాహుల్ గాంధీ తనకి కేటాయించిన సీటులోనే కూర్చున్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో 15 జనవరి 2025న కాంగ్రెస్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్షప్రసారం (ఇక్కడ & ఇక్కడ) చేసినట్లు గుర్తించాం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని ఈ వీడియో చూపిస్తుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇక వైరల్ వీడియో విషయానికి వస్తే, పూర్తి వీడియో ప్రకారం కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో స్టేజిపైన కే. సీ. వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అజయ్ మాకెన్ వరుసగా కూర్చున్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత వచ్చి తన సీటులో కూర్చున్నారు. 46:45 నిమిషాల వద్ద మల్లికార్జున ఖర్గేని ప్రసంగించమని అజయ్ మాకెన్ ఆహ్వానించారు. అప్పుడు రాహుల్ గాంధీ తన కుర్చీ నుంచి లేచి ఖర్గే కుర్చీని వెనక్కి లాగి ఆయన వెళ్లడానికి సాయం చేశారు. ఖర్గే ప్రసంగం ప్రారభించాక రాహుల్ గాంధీ తిరిగి తన కుర్చీలో కూర్చుంటారు. ఈ ఘటనను క్రింది ఫోటోలలో చూడవచ్చు. చివరిగా, ఖర్గే ప్రసంగం ముగించాక తిరిగి తన కుర్చీలో కూర్చుంటారు. పూర్తి వీడియోలో ఎక్కడా కూడా రాహుల్ గాంధీ ఖర్గేని లేపి ఆ సీటులో కూర్చున్న దృశ్యాలు లేవు.

చివరిగా, తన సీటులో కూర్చున్నందుకు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేని లేపి పంపించారంటూ చేస్తున్న వాదనలో నిజం లేదు.