Fake News, Telugu
 

IT చట్టంలోని సెక్షన్ 66(A) ని సుప్రీం కోర్టు 2015 లోనే రద్దు చేసింది

0

IT చట్టం, 2000 లోని సెక్షన్ 66(A) ని సుప్రీం కోర్టు రద్దు చేసిందని, ఇప్పుడు ఇంక ఇష్టం వచ్చినట్టు ప్రజానాయకుల ని ఏమన్నా అనొచ్చు , సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొచ్చని, పోలీసులు అరెస్ట్ చేయలేరని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ) ని సుప్రీం కోర్టు రద్దు చేసినందున ఇష్టం వచ్చిన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టొచ్చు. పోలీసులు అరెస్ట్ చేయలేరు.

ఫాక్ట్ (నిజం): IT చట్టంలోని సెక్షన్ 66(A) ని సుప్రీం కోర్టు 2015 లోనే రద్దు చేసింది; తాజాగా కాదు. అంతేకాదు, పోస్ట్ లో చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చింది పోస్ట్ చేయలేరు. ఎందుకంటే, ఇంకా వేరే చట్టాల్లో వివిధ సెక్షన్ల కింద సోషల్ మీడియాలో ఆ చట్టాలకి విరుద్ధంగా పోస్ట్ చేస్తే, పోలీసులు అరెస్ట్ చేసే ఆస్కారం ఉంది. కావున పోస్ట్ లో సెక్షన్ 66(A) రద్దు అవ్వడంతో సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేయొచ్చని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తునారు.

పోస్ట్ లో పెట్టిన వార్త గురించి ఇంటర్నెట్ లో వెతకగా, IT చట్టం, 2000 లోని సెక్షన్ 66(A) ని సుప్రీం కోర్టు 2015 లోనే రద్దు చేసిందని, తాజాగా కాదని తెలిసింది. అలానే, ఆ సెక్షన్ రద్దు చేసాక కూడా చాలా మందిని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేసినట్టు చాలా న్యూస్ ఆర్టికల్స్ దొరికాయి. కావున, అసలు ఆ సెక్షన్ ఏంటి, అది రద్దు అయ్యాక కూడా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఆధారంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే విషయాలు కింద వివరంగా చూద్దాం.

ఐటీ చట్టం, 2000 లోని సెక్షన్ 66(ఏ) యొక్క వివారాలు:

ఐటీ చట్టం, 2000 లోని సెక్షన్ 66(A) ని ఐటీ (సవరణ) చట్టం, 2008 ద్వారా చేర్చబడింది. ఆ సెక్షన్ కి సంబంధించిన వివరాలు కింద ఫోటోలో చూడవొచ్చు. సెక్షన్ 66(A) ని 24 మార్చి 2015న శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు లో సుప్రీం కోర్టు రద్దు చేసినట్టు ఐటీ చట్టంలో ఇప్పుడు చదవొచ్చు. దానికి సంబంధించిన సుప్రీం కోర్టు తీర్పుని ఇక్కడ చదవొచ్చు.

అయితే, ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) మరియు ఇతర చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద కూడా సోషల్ మీడియాలో ఆ చట్టాలకి విరుద్ధంగా పోస్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేసే ఆస్కారం ఉందని తెలుస్తుంది. వాటిల్లోని కొన్ని సెక్షన్లను కింద చదవొచ్చు.

విపత్తు నిర్వహణ చట్టం, 2005  లోని సెక్షన్ 54:

సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టిన చాలా మందిని ఈ చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేసినట్టు చాలా న్యూస్ ఆర్టికల్స్ ఇంటర్నెట్ లో చూడవొచ్చు. రాచకొండ పోలీసువారు కూడా ఈ చట్టం కింద కొంత మందిని అరెస్ట్ చేసినట్టు చెప్తూ పెట్టిన ట్వీట్లను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, కోవిడ్-19 లాంటి వ్యాధుల గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేస్తే అంటువ్యాధుల నివారణ చట్టం,1897 కింద కూడా అరెస్ట్ చేయవొచ్చు.

వివిధ ఐపీసీ సెక్షన్లు:

ఢిల్లీ అల్లర్ల పై మరియు ప్రధాని మోదీని విమర్శిస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినందుకు అస్సాం లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ‘ఇండియా టుడే’ వెబ్సైటులో చదవొచ్చు. ఆ వ్యక్తి పై ఐపీసీ సెక్షన్ 295(ఏ), 153(ఏ), 507 మరియు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (సెక్షన్ 66(A) కాదు) కింద కేసు బుక్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు, మరొక ఘటనలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ని అవమానిస్తూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టినందుకు ఒక వ్యక్తి పై దేశద్రోహం (సెడిషన్ – ఐపీసీ 124(ఏ)) మరియు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసుపెట్టినట్టు ఇక్కడ చదవొచ్చు.

సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ఆధారంగా ఐపీసీ సెక్షన్ల కింద ఎంతో మందిని అరెస్ట్ చేసిన వివిధ ఘటనలు ఉన్నట్టు తెలుస్తాయి. అలాంటి సంఘటనలకు ఆ సెక్షన్లు ఉపయోగించవచ్చా లేదా అనేది చర్చనీయాంశమైనది; వాటిపై కోర్టులు నిర్ణయిస్తాయి. అయితే, ఐపీసీ లోని కొన్ని సెక్షన్ల వివరాలను కింద చదవొచ్చు.

ఐటీ చట్టం, 2000 లోని వేరే సెక్షన్లు:

ఐటీ చట్టం, 2000 లోని సెక్షన్ 66(A) ఇప్పుడు లేకున్నా, ఐటీ చట్టం (2000) లోని వేరే సెక్షన్ల కింద ఒక వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకరమైన అశ్లీల ఫోటోలు పోస్ట్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయవొచ్చు. ఐటీ చట్టం, 2000 లోని సెక్షన్ 67 కింద నమోదవుతున్న కేసులు పెరుగుతున్నట్టు చెప్తూ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, IT చట్టంలోని సెక్షన్ 66(ఏ) ని సుప్రీం కోర్టు 2015 లోనే రద్దు చేసింది; తాజాగా కాదు. అంతేకాదు, పోస్ట్ లో చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చింది పోస్ట్ చేయలేరు. వేరే చట్టాల్లో వివిధ సెక్షన్ల కింద అరెస్ట్ చేసే ఆస్కారం ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll