Fake News, Telugu
 

జైన్ మందిరం యొక్క పాత 3D యానిమేషన్ డిజైన్ ని అయోధ్యలో కట్టబోయే రామ మందిరం డిజైన్ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

అయోధ్యలో కట్టబోయే రామ మందిరం డిజైన్ యొక్క 3D నమూనా అని చెప్తూ ఉండే పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: అయోధ్యలో కట్టబోయే రామ మందిరం డిజైన్ యొక్క 3D నమూనా.

ఫాక్ట్ (నిజం): 03 జూన్ 2014న యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఒక జైన్ మందిరం డిజైన్ వీడియోని ట్రిమ్ చేసి అయోధ్యలో కట్టబోయే రామ మందిరం డిజైన్ గా చెప్తున్నారు. ‘కేమ్స్ స్టూడియో’ వారిని మేము సంప్రదించినప్పుడు వారు ఆ డిజైన్ తిరుపతిలో కట్టబోయే జైన్ మందిరం కోసం తాయారు చేసిందని చెప్పారు. కావున పోస్ట్ ద్వారా చెప్తున్నది తప్పు.

ఈ వీడియో గురించి మేము మరింత సమాచారం సేకరించే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్ లో ‘3D ఆర్కిటెక్చర్ టెంపుల్’ అనే కీ వర్డ్ తో వెతకగా మాకు ‘కేమ్స్ స్టూడియో’ అనే యూట్యూబ్ ఛానల్ లో అచ్చం పోస్ట్ లో ఉన్న వీడియో లాంటిదే 3 నిమిషాల 41 సెకండ్స్ నిడివిగల ఒక వీడియో దొరికింది. ఐతే ఈ వీడియో అప్లోడ్ చేసిన తేదీ మాత్రం 03 జూన్ 2014 గా ఉంది.

వీడియో అప్లోడ్ చేసిన తేదీ ప్రకారం ఈ వీడియో లో ఉన్న డిజైన్ కి అయోధ్యలో కట్టబోయే రామ మందిరానికి సంబంధం లేదని చెప్పొచ్చు ఎందుకంటే రామ మందిరానికి సంబంధించిన సుప్రీం కోర్ట్ తీర్పు 09 నవంబర్ 2019న వెలువడింది. సుప్రీం కోర్ట్ తీర్పు పూర్తి కాపీని ఇక్కడ చదవొచ్చు.

కేమ్స్ స్టూడియో వారితో మేము మాట్లాడినప్పుడు వారు ఆ డిజైన్ తిరుపతిలో కట్టబోయే జైన్ మందిరం కోసం తాయారు చేసిందని చెప్పారు. వారు ఆ డిజైన్ కి అయోధ్యలో కట్టబోయే రామ మందిరానికి సంబంధంలేదని కచ్చితంగా చెప్పారు. ఒకసారి ఆ వీడియోని జాగ్రతగా చూస్తే, వీడియో మొదట్లో లొకేషన్ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిగా చూపిస్తుంది. అంతే కాదు, ఆ వీడియోలో చాలా జైన్ విగ్రహాలు మనకు కనిపిస్తాయి.

మూడు దశాబ్దాల ముందు చంద్రకాంత్ సోంపూర అయోధ్యలోని రామ మందిరం కోసం తాయారు చేసిన డిజైన్ నే కొన్ని మార్పులతో ఇప్పుడు కట్టబోయే మందిరం డిజైన్ గా నిర్ణయించారన్న వార్త చాలా వార్త సంస్థలు ప్రచురించాయి. ఈ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, పోస్ట్ లో ఉన్న డిజైన్ అయోధ్యలో కట్టబోయే రామ మందిరానికి సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll