అయోధ్య లోని రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయన్న ఆనందంలో సంబరాలు జరుపుకుంటున్న స్పెయిన్ దేశంలోని భారతీయులు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనులు మొదలవుతున్నాయన్న ఆనందంలో సంబరాలు చేసుకుంటున్న స్పెయిన్ లోని భారతీయులు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, స్పెయిన్ దేశంలో జరిగిన ఒక భారతీయ కార్యక్రమానికి సంబంధించిన వీడియో అని విశ్లేషణలో తెలిసింది. 2018లో మహారాష్ట్రకి చెందిన ‘Swargandhar Dhol Tasha Pathak’ డాన్స్ గ్రూప్ స్పెయిన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ జానపద ఉత్సవంలో ప్రదర్శన ఇచ్చినప్పుడు తీసిన వీడియో అది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోలు ‘Swargandhar Dhol Tasha Pathak’ అనే యూట్యూబ్ చానల్ లో దొరికాయి. అవి ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 2018లో స్పెయిన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ జానపద ఉత్సవంలో మహారాష్ట్రకి చెందిన ‘Swargandhar Dhol Tasha Pathak’ అనే డాన్స్ గ్రూప్ ప్రదర్శన ఇచ్చినట్టు విశ్లేషణలో తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ఆ వీడియో ఈ ప్రదర్శనకు సంబంధించినది.
‘Swargandhar Dhol Tasha Pathak’ డాన్స్ గ్రూప్ వారు స్పెయిన్ లో చేస్తున్న జానపద నృత్య ప్రదర్శనకు సంబంధించిన వివరాలు తెలుపుతూ ‘Mid-Day.com’ వారు రాసిన ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు.
చివరగా, 2018లో స్పెయిన్ దేశంలో చేసిన భారతీయ నృత్య ప్రదర్శనను చూపిస్తూ అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రారంభానికి సంబంధించిన సంబరాలుగా షేర్ చేస్తున్నారు.