Fake News, Telugu
 

హాలాల్ ఆచారంలో భాగంగా ఆహారంలో ఉమ్మి కలుపుతామని ముస్లింలు కోర్టులో అంగీకరించలేదు

0

తమిళనాడులోని ఒక కోర్టు కేసులో ఆహారంలో ఉమ్మివేయనంత వరకు హలాల్ పూర్తి కాదని ముస్లింలు అంగీకరించారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. తమిళనాడులోనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలలో హలాల్ ఆచారంలో భాగంగా వంటలలో ఉమ్మివేస్తామని వారు అంగీకరించినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హలాల్‌లో భాగంగా ఆహారంలో ఖచ్చితంగా ఉమ్మివేస్తామని ముస్లింలు తమిళనాడు కోర్టులో ఒప్పుకున్నారు.

ఫాక్ట్ (నిజం): శబరిమల అయ్యప్ప దేవాలయంలో ప్రసాదం తయారుచేయడం కోసం హలాల్-సర్టిఫైడ్ పాడైపోయిన బెల్లంని ఉపయోగిస్తున్నారని కేరళ హైకోర్టులో ఇటీవల ఒక పిటిషన్ దాఖలైంది. హాలాల్ ఆచారంలో భాగంగా తినే పదార్దాలలో ఖచ్చితంగా ఉమ్మి కలుపుతారని ఈ పిటిషన్లో, కేసు వేసిన పిటిషనర్లు ఆరోపించారు. శబరిమల ప్రసాదానికి కావలిసిన బెల్లం పదార్ధాలను 2019-20 వరకు ‘Southern Agro Tech Pvt. Ltd’, ఆ తరువాత నుండి మహారాష్ట్రకు చెందిన ‘SP Sugar & Agro Private Limited’ సమకూరుస్తుందని ట్రావెన్‌కోర్ దేవసోం బోర్డ్ కేరళ హైకోర్టుకు తెలిపింది. ఈ ప్రైవేటు కంపెనీలు సరఫరా చేస్తున్న బెల్లం పదార్ధాలు విదేశాలకు కూడా సరఫరా అవుతుండడంతో, ఈ బెల్లం ప్యాక్ కవర్లపై హలాల్ సర్టిఫైడ్ ప్రింట్ చేసినట్టు ట్రావెన్‌కోర్ దేవసోం బోర్డ్ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో చేర్చిన ప్రతివాదులలో ముస్లిం వ్యక్తులు గాని లేదా, ముస్లిం సంస్థలను కాని ఎక్కడా జత చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, ముస్లింలు తమిళనాడు కోర్టులో హలాల్ ఆచారంలో భాగంగా ఆహారంలో ఉమ్మివేస్తున్నామని ఒప్పుకున్నట్టు ఎక్కడ రిపోర్ట్ అవలేదని తెలిసింది. అయితే, శబరిమల ఆయప్ప స్వామి దేవాలయంలో పంచే ‘అరవన’, ‘అప్పం’ ప్రసాదాలలో హలాల్-సర్టిఫైడ్ ఉంది పాడైపోయి ఉన్న బెల్లం పౌడర్లని కలుపుతున్నారని ఇటీవల కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయినట్టు తెలిసింది. ట్రావెన్‌కోర్ దేవసోం బోర్డ్, సంబంధిత సంస్థలకు వ్యతిరేకంగా శబరిమల కర్మ సమితి జనరల్ కన్వినర్ SJR కుమార్ ఈ పిటిషన్ వేసినట్టు తెలిసింది. హాలాల్ ఆచారంలో భాగంగా ముస్లింలు తినే పదార్దాలలో ఖచ్చితంగా తమ ఉమ్మి కలుపుతారని SJR కుమార్ తన పిటిషన్లో ఆరోపించారు. అన్యమత ఆచారంతో, అపరిశుభ్రమైన హాలాల్ ఉత్పత్తులతో తయారుచేస్తున్న ఈ ప్రసాదాలని శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఉపయోగించకుడదని ఈ పిటిషన్‌లో కోరారు.

శబరిమల దేవస్థానం బోర్డు స్పెషల్ కమిషనర్ ఈ పిటిషన్‌కు సంబంధించి కేరళ హైకోర్టుకు 18 నవంబర్ 2021 నాడు వివరణ ఇచ్చారు. 2019-20 సంవత్సరానికి గాను ‘అరవన’ మరియు ‘అప్పం’ ప్రసాదాలకు కావలిసిన బెల్లం పదార్ధాలను త్రిస్సురుకు చెందిన ‘M/s Southern Agro Tech Pvt.Ltd.’ సంస్థ సమకూర్చిందని కమిషనర్ హైకోర్టుకి తెలిపారు. కోవిడ్-19 నిబంధనల కారణంగా భక్తులు సందర్శన తక్కువ కావడంతో చాలా వరుకు సరుకు మిగిలిపోయిందని, మిగిలిపోయి పాడైపోయిన బెల్లాన్ని పశువుల మేత కోసం వేలానికి పెట్టినట్టు శబరిమల దేవస్థానం బోర్డు కేరళ హైకోర్టుకు తెలిపింది. 2021 ఏప్రిల్ నెల నుండి ఈ కాంట్రాక్టు మహారాష్ట్రకు చెందిన ‘Southern Agro Tech Pvt. Ltd’ సంస్థ దక్కించుకుందని, ఈ సంస్థ సరఫరా చేసిన తాజా బెల్లం పదార్ధాలను మాత్రమే భక్తులకు పంచుతున్నట్టు శబరిమల దేవస్థానం బోర్డు హైకోర్టుకి తెలిపింది.

శబరిమల అయ్యప్ప దేవాలయానికి బెల్లం పదార్ధాలని సరఫరా చేస్తున్న కంపెనీలు, ఈ బెల్లం పదార్ధాలని విదేశాలకు కూడా సరఫరా చేస్తున్న కారణం చేత ఈ బెల్లం ప్యాక్ కవర్లపై హలాల్ సర్టిఫైడ్ ప్రింట్ చేసి ఉన్నాయని ట్రావెన్‌కోర్ దేవసోం బోర్డ్ కేరళ హైకోర్టుకు స్పష్టం చేసింది. ప్రసాదాలలో ఉపయోగించే ఈ బెల్లం పదార్ధాలని పంపా, ఇంకా సన్నిధానంలోని లాబొరేటరీలలో క్షుణ్ణంగా పరిశీలించి ఆ తరువాతే ప్రసాదం తయారుచేయడానికి ఉపయోగిస్తామని ట్రావెన్‌కోర్ దేవసోం బోర్డ్ కేరళ హైకోర్టుకు తెలిపింది. 22 నవంబర్ 2021 నాడు ఈ కేసు విచారణలో భాగంగా కేరళ హైకోర్టు న్యాయమూర్తులు పిటిషనర్‌ను హాలాల్ అర్ధం పూర్తిగా తెలుసుకొని పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. హాలాల్, ఆహార పద్దతులలో కొన్ని విషయాలని నిషేదిస్తుందని, నిషేధించిన పదార్ధాలు లేని ఆహారాన్ని హలాల్ అని పిలుస్తారని కోర్టు పిటిషనర్‌కు వివరించింది. హలాల్ సర్టిఫైడ్ ఆహరం అంటే, నిషేధించిన పదార్ధలేవి అందులో లేవని అర్ధమని కోర్టు పిటిషనర్‌కు చెప్పింది. ఈ కేసు విచారణలో భాగంగా కేరళ హైకోర్టు ఏ ఒక్క ముస్లిం సంస్థను లేదా ముస్లిం వ్యక్తిని విచారించలేదు.

చివరగా, హాలాల్ ఆచారంలో భాగంగా ఆహారంలో ఉమ్మి కలుపుతామని ముస్లింలు కోర్టులో అంగీకరించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll