మధ్యప్రదేశ్‌లోని సీధీకి చెందిన పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి దశరత్ రావత్ అనే గిరిజన కార్మికుడిపై మూత్ర విసర్జన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (ఇక్కడ, ఇక్కడ ) అయిన సందర్భంగా, దీని తర్వాత జరిగిన సంఘటన అని చెపుతూ మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తిని ఒక వాహనానికి కట్టేసి ఈడ్చుకెళ్లడం మనం చూడవచ్చు. ఇతను ఒక గిరిజన వ్యక్తి అని, దీని వళ్ళ అతడు ప్రాణాలు కోల్పోయాడని ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో వెనుక ఉన్న వాస్తవాలను ఈ కథనం ద్వారా అర్థం చేసుకుందాం.
క్లెయిమ్: మధ్యప్రదేశ్‌లోని సీధీలో జరిగిన ఘటన తర్వాత ఓ గిరిజనుడిని వాహనానికి కట్టేసి ఈడ్చుకెళ్లిన సంఘటనకు చెందిన వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపించే ఈ సంఘటన ఇప్పటిది కాదు, 2021లో జరిగింది. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.
ఒక గిరిజన వ్యక్తిని మధ్యప్రదేశ్‌లో నిజంగానే వాహనానికి కట్టేసి, ఈడ్చుకెళ్లిన సంఘటన జరిగినప్పటికీ, ఇది దాదాపు రెండేళ్ల క్రితం నాటి సంఘటన అని, ఇటీవలి జరిగినది కాదని మేము కనుగొన్నాము.
వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, మేము ఇంటర్నెట్‌లో తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా. ఈ సంఘటనపై ఆగస్ట్ 2021లో ప్రచురితమైన కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) దొరికాయి.
ఈ కథనాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో, ఒక గిరిజన వ్యక్తిని కొట్టి, వాహనానికి కట్టేసి, కొందరు వ్యక్తులు ఈడ్చుకెళ్లారు. అతనికి మరియు ఒక పాల వ్యాపారికి మధ్య జరిగిన ఒక చిన్న ప్రమాదం దీనంతటికి దారితీసింది. వార్తా పత్రికలు అతనిని కన్హయ్యలాల్ భీల్‌గా గుర్తించాయి. కన్హయ్యలాల్ ఒక దోపిడీదారుడు అనుకొన్నారని, విచారణ సమయంలో కొట్టినవారు పోలీసులకి తలిపారు. తర్వాత, కన్హయ్యలాల్ భీల్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
చివరిగా, మధ్యప్రదెశ్‌కి చెందిన ఒక గిరిజన వ్యక్తిని వాహనంతో ఈడ్చుకెళ్తున్న ఈ వీడియో 2021 నాటిది.