Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేని వీడియోని కాకినాడ బీచ్ సమీపంలో సింహం సంచరిస్తున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు

0

కాకినాడ బీచ్ సమీపంలో సింహం సంచరిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కాకినాడ బీచ్ సమీపంలో సింహం సంచరిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోని ఇటీవల దేశంలోని వివిధ ప్రదేశాలకు ముడి పెడుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో గుజరాత్ కి సంబంధించిందని తమిళనాడు అటవీశాఖ శాఖ అధికారులు తెలుపుతున్నపటికి, ఆ విషయాన్నీ ద్రువీకరించేలా ఎటువంటి అధికారిక సమాచారం ఇంటర్నెట్ లో దొరకలేదు. కాకినాడ బీచ్ లో సింహం సంచరిస్తుందని రిపోర్ట్ చేస్తూ ఇటీవల ఎటువంటి వార్తలు రాలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతకగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ బీచ్ లో సింహం సంచరిస్తున్న విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఎటువంటి న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అవలేదని తెలిసింది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ వీడియో గురించి రిపోర్ట్ చేస్తూ ‘Tamil Samayam’ న్యూస్ వెబ్సైటు 21 జూన్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. తమిళనాడు తలైయుతూ రైల్వే స్టేషన్ సమీపంలో సింహం సంచరిస్తున్న దృశ్యాలుగా ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో తమిళనాడుకి సంబంధించింది కాదని, గుజరాత్ రాష్ట్రంలోని ఒక ఫ్యాక్టరీ సమీపంలో తీసినట్టు తమిళనాడు అటవీశాఖ శాఖ అధికారులు స్పష్టం చేసారు.

కొందరు ఈ వీడియోని తమిళనాడు తిరునేల్వేలి నగరంలోని శంకర్ సిమెంట్ ప్లాంట్ సమీపంలో తీసినట్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, దానికి సంబంధించి స్పష్టతనిస్తూ తిరునేల్వేలి DSP అర్జున్ సరవనన్ ట్వీట్ పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సింహం వీడియో తిరునేల్వేలి సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో తీసింది కాదని DSP అర్జున్ సరవనన్ తన ట్వీట్ లో తెలిపారు. ఈ వీడియోని గుజరాత్ రాష్ట్రంలోని స్టేట్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో తీసారని అర్జున్ సరవనన్ పేర్కొన్నారు.

పోస్టులో షేర్ చేసిన అవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Namaste Junagdh’ అనే మీడియా సంస్థ 04 జూన్ 2021 నాడు తమ ఫేస్బుక్ పేజిలో షేర్ చేసింది. గుజరాత్ రాష్ట్రం సుత్రపడ నగరంలోని GHCL ఫ్యాక్టరీ సమీపంలో సింహం సంచరిస్తున్న దృశ్యాలని ఈ పోస్టు వివరణలో తెలిపారు. ఈ వీడియోని తమ యూట్యూబ్ ఛానెల్లో కూడా షేర్ చేసారు. అయితే, ఈ విషయాన్నీ ద్రువీకరిస్తూ ఎటువంటి న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అవలేదు. గుజరాత్ రాష్ట్రంలో సింహాలు పలు సార్లు జనసముహంలో సంచరించిన ఘటనలు ఇంతకు ముందు చోటుచేసుకున్నాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన వీడియో ఎక్కడిదో స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ వీడియో కాకినాడ బీచ్ సమీపంలో తీసింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేని వీడియోని కాకినాడ బీచ్ సమీపంలో సింహం సంచరిస్తున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll