Fake News, Telugu
 

ఈజిప్ట్ దేశంలో ఒక వ్యక్తి తన వాహనంపై మానిక్వీన్‌ను (బొమ్మను) తరలిస్తున్న ఫోటోని ముస్లిం వ్యక్తి మహిళ శవాన్ని తీసుకెళుతున్న ఫోటో అని షేర్ చేస్తున్నారు

0

ఒక ముస్లిం మూటలో శవాన్ని కప్పేసి తన ద్విచక్ర వాహనంపై తీసుకెళుతున్న దృశ్యమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. దీన్ని లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు. ఫొటోలో కనిపిస్తున్న ద్విచక్ర వాహనం వెనుక భాగంలో ఉన్న సంచి నుండి మనిషి పాదంలా కనిపించే ఒక భాగం భయటకి కనిపిస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ముస్లిం వ్యక్తి మూటలో ఒక వ్యక్తి శవాన్ని కప్పేసి తన ద్విచక్ర వాహనంపై తీసుకెళుతున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): ఈజిప్ట్ దేశం కైరో నగరంలో ఒక వ్యక్తి బట్టల షాప్ బయట పెట్టే మానిక్వీన్‌ను (బొమ్మను) రవాణా చేస్తుండగా తీసిన చిత్రమిది. ముహమ్మద్ నాసర్ అనే వ్యక్తి కైరో నగరం మక్కోటం ప్రాంతంలోని BG కలెక్షన్ స్టోరుకు మానిక్వీన్‌ను తీసుకెళ్తుండగా ఈ ఫోటోని తీశారు. ఈ ఫోటోలో బైకుపై తీసుకెళ్తున్నది వ్యక్తి శవం కాదు. అలాగే, ఈ ఫోటోను మతపరమైన నేపథ్యంతో తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే చిత్రాన్ని షేర్ చేస్తూ ‘కైరో 24’ వార్తా సంస్థ 02 జూన్ 2023 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈజిప్ట్ దేశం కైరో నగరంలో ఒక వ్యక్తి మానిక్వీన్‌ను (బొమ్మను) రవాణా చేస్తుండగా తీసిన చిత్రమని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ‘కైరో 24’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన రిపోర్టుకు స్పందించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఫోటోకు సంబంధించి స్పష్టతనిచ్చిందని, ట్రాన్స్‌పొర్ట్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి, బట్టల షాపుల బయట ఉంచే మానిక్వీన్‌ను (బొమ్మను) రవాణా చేస్తుండగా ఈ ఫోటోను తీసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.

ఈ ఫోటోకు సంబంధించి వివధ వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కైరోలో ఒక వస్త్రాల షాప్ యజమాని ఒక మానిక్వీన్‌ను (బొమ్మను) తమ సంస్థకు చెందిన ఒక బ్రాంచ్ నుండి మరో బ్రాంచుకు తీసుకెళ్లాలని కొరడంతో, ట్రాన్స్‌పొర్ట్ కంపెనీకి చెందిన ముహమ్మద్ నాసర్ అనే ఒక ఉద్యోగి, ఆ మానిక్వీన్‌ను (బొమ్మను) గమ్యానికి తరలిస్తుండగా ఈ చిత్రం తీసినట్టు వార్తా సంస్థలు తమ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఫోటోకు సంబంధించి ముహమ్మద్ నాసర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఫోటోని ఎవరైతే తీశారో, వారు తన జీవితాన్ని నాశనం చేశారని, సోషల్ మీడియాలో ప్రజలు తన ఫోటోని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, ఇది తన జీవితంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపెట్టిందని తెలిపారు.

మానిక్వీన్‌ను (బొమ్మను) తరలించమని కోరిన BG కలెక్షన్ స్టోర్, ఈ ఫోటోకి సంబంధించి పలు ఫేస్‌బుక్ పోస్టులు పెట్టింది. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. గమల్ అబ్డెల్ నస్సర్ బ్రాంచ్ నుండి అల్-ముక్కట్టం బ్రాంచుకు తమ వ్యక్తి మానిక్వీన్‌ను (బొమ్మను) తరలిస్తుండగా ఈ ఫోటో తీసినట్టు BG కలెక్షన్ స్టోర్ ఒక పోస్టులో స్పష్టంగా పేర్కొంది.

చివరగా, ఈజిప్ట్ దేశంలో ఒక వ్యక్తి తన వాహనంపై మానిక్వీన్‌ను (బొమ్మను) తరలిస్తున్న ఫోటోని ముస్లిం వ్యక్తి ద్విచక్రవాహనంపై శవాన్ని తీసుకెళుతున్న చిత్రమని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll