Fake News, Telugu
 

2023 చివర్లో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించలేదు

0

మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించిందన్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ మరియు ఇక్కడ). ఎన్నికల తేదీల వివరాలు షేర్ చేయడంతో పాటు, భారత ఎన్నికల కమీషన్ (ECI) ఆయా రాష్ట్రాల CS, CEOలకు మార్గదర్శకాలు జారీ చేసిందని కూడా ఈ పోస్టులలో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించింది.

ఫాక్ట్(నిజం): కేంద్ర ఎన్నికల సంఘం మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. ఐతే ఇంకా ఎన్నికల తేదీలను మాత్రం ప్రకటించలేదు. రాష్ట్రాల ఎన్నికల అధికారులకు అందించిన ఆదేశాలలో ఆయా రాష్ట్రాలలో శాసనసభ గడువు ముగింపునకు సంబంధించి పేర్కొన్న తేదీలను, ఎన్నికల తేదీలంటూ తప్పుగా అర్ధం చేసుకున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇదే ఏడాది (2023) తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టిందని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి జాతీయ ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు/చీఫ్ సెక్రటరీలకు 02 జూన్ 2023న  ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలకు సంబంధించిన కాపీలను పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి కూడా (ఇక్కడ మరియు ఇక్కడ). ప్రస్తుతం వైరల్ అవుతున్నది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఐదు రాష్ట్రాలకు పంపించిన ఆదేశాల కాపీయే.

కాని ఈ కాపీలో కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించలేదు. ఈ ఐదు రాష్ట్రాలలో శాసనసభ గడువు ముగింపునకు సంబంధించి పేర్కొన్న తేదీలను, ఎన్నికల తేదీగా తప్పుగా అర్ధం చేసుకున్నారు. మిజోరం రాష్ట్ర శాసనసభ గడువు ఈ సంవత్సరం డిసెంబర్‌లో ముగియనుండగా మిగతా నాలుగు రాష్ట్రాల గడువు వచ్చే ఏడాది జనవరిలో ముగియనున్నాయి.

అంతకు ముందు, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలలో ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించి ఈ ఐదు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఐతే ప్రస్తుతానికి ఎన్నికల సంఘం ఈ ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందే తప్ప, ఇంకా ఎన్నికల తేదీలను ప్రకటించలేదు. ఈ రాష్ట్రాలలో ఇంకా శాసనసభ రద్దు కాలేదు కాబట్టి, ఎన్నికల తేదీ రావడానికి ఇంకా సమయం ఉంది.

చివరగా, రాష్ట్ర శాసనసభ గడువు ముగింపునకు సంబంధించిన తేదీలను తప్పుగా అర్ధం చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించిందని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll