Fake News, Telugu
 

ఒలింపిక్స్ ఫైనల్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను పాకిస్తాన్ కి చెందిన అర్షద్ నదీమ్ కాజేయలేదు

0

ఇటీవల నీరజ్ చోప్రా టైమ్స్ అఫ్ ఇండియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒలింపిక్స్ ఫైనల్ ప్రారంభంలో నేను నా జావెలిన్ కోసం వెతుకుతున్నప్పుడు, అది పాకిస్తాన్ కి చెందిన అర్షద్ నదీమ్ వద్ద కనబడడంతో అతనిని అడిగి తీసుకున్నానని, అందుకే నేను నా మొదటి త్రో తొందరపడుతూ విసిరానని చెప్పాడు. ఐతే ఈ నేపథ్యంలోనే ‘ఒలంపిక్స్ లో జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను పాక్ జావెలిన్ త్రోవర్ అర్షద్ కాజేశాడు’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘ఒలంపిక్స్‌లో జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ కాజేశాడు’.

ఫాక్ట్(నిజం): వరల్డ్ అథ్లెటిక్స్ ఆర్గానైజేషన్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ యొక్క రూల్స్ ప్రకారం ఈవెంట్లలో ఉపయోగించే క్రీడా పరికరాలు (ఉదా- జావెలిన్) అందరికీ కామన్‌గా ఉంటాయి. పూల్ నుండి ఎవరు ఏ పరికరాన్నైనా ఎంచుకోవచ్చు. ఒకవేళ ఆటగాడు తన సొంత పరికరాన్ని తెచ్చుకుంటే, అధికారులు మొదటగా ఆ పరికరాన్ని తనిఖీ చేసి క్లియరెన్స్ ఇస్తారు, ఆ తర్వాత ఆ పరికరం కూడా పూల్‌లో పెడతారు, దానిని ఎవరైనా వాడుకోవచ్చు. నీరజ్ చోప్రా కూడా ఒక వీడియో ద్వారా ఇదే విషయాన్నీ తెలుపుతూ పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ చేసిన దాంట్లో తప్పేమిలేదని అన్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వరల్డ్ అథ్లెటిక్స్ ఆర్గానైజేషన్ వెబ్సైటులో ప్రపంచ అథ్లెటిక్స్ సీరీస్‌కి సంబంధించిన రెగ్యులేషన్స్ డాక్యుమెంట్‌లో చెప్తున్నదాని ప్రకారం ఈవెంట్లలో ఉపయోగించే క్రీడా పరికరాలు (ఉదా- జావెలిన్) అందరికీ కామన్‌గా ఉంటాయి. పూల్ నుండి ఎవరు ఏ పరికరాన్నైనా ఎంచుకోవచ్చు. ఒకవేళ ఆటగాడు తన సొంత పరికరాన్ని తెచ్చుకుంటే, అధికారులు మొదటగా ఆ  పరికరాన్ని  తనిఖీ చేసి క్లియరెన్స్ ఇస్తారు, ఆ తర్వాత ఆ పరికరం కూడా పూల్‌లో పెడతారు, దానిని ఎవరైనా వాడుకోవచ్చు.

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ (IAAF) యొక్క 2018-19 పోటీలకు సంబంధించిన రూల్ బుక్‌లో జావెలిన్ త్రోకి సంబంధించి ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. నీరజ్ చోప్రా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో అథ్లెటిక్స్ రూల్స్‌కి సంబంధించిన వివరాలు తెలుపుతూ ప్రచురించిన వార్తా కథనాలలో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు.

నీరజ్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నీరజ్ చోప్రా ఒక వీడియో ద్వారా ఈ విషయానికి సంబంధించి వివరణ ఇచ్చారు. “వాస్తవానికి ఇది చాలా సాధారణ విషయం – రూల్ ప్రకారం అందరు తమ వ్యక్తిగత జావెలిన్‌లను ఒక సాధారణ పూల్‌లో ఉంచుతాము, ఇందులో నుండి ఎవరు ఏ జావెలిన్‌నైనా ఉపయోగించవచ్చు. అందుకే అర్షద్ తన త్రో కోసం నా జావెలిన్‌తో ప్రాక్టీస్ చేసాడు, ఇందులో తప్పు లేదు. ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారు”  అని ఈ వీడియోలో నీరజ్ పేర్కొన్నారు.

చివరగా, ఒలింపిక్స్ ఫైనల్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను పాకిస్తాన్ జావెలిన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ కాజేయలేదు, రూల్ ప్రకారం ఎవరు ఏ జావెలిన్‌నైనా ఉపయోగించవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll