Fake News, Telugu
 

కేరళ ప్రభుత్వం పెట్రోల్‌పై 9 రూపాయలు, డీజిల్‌పై 12 రూపాయలు ఇటీవల తగ్గించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు

0

ఇటీవల కేరళలో పెట్రోల్‌పై 9 రూపాయలు, డీజిల్‌పై 12 రూపాయలు తగ్గించారని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన వామపక్ష కేరళ ప్రభుత్వం అని పోస్టులో అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల పెట్రోల్‌పై 9 రూపాయలు, డీజిల్‌పై 12 రూపాయలు తగ్గించిన కేరళ ప్రభుత్వం.

ఫాక్ట్: కేరళ ప్రభుత్వం పెట్రోల్‌పై 9 రూపాయలు, డీజిల్‌పై 12 రూపాయలు తగ్గించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. చివరగా, 2018లోనే కేరళ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఉన్న పన్నులను తగ్గించింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, కేరళ ప్రభుత్వం పెట్రోల్‌పై 9 రూపాయలు, డీజిల్‌పై 12 రూపాయలు తగ్గించారని ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి నిర్ణయం కేరళ ప్రభుత్వం తీసుకొనుంటే, ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.

ఎకనామిక్ టైమ్స్ వారు తమ వెబ్సైటులో పోయిన పది రోజులకు గాను కేరళలో పెట్రోల్, డీజిల్ రేట్ల డేటాను పొందుపరిచారు. ఆ యొక్క డేటాను చూసినట్లయితే గత పది రోజుల్లో పెద్దగా రేట్లు తగ్గినట్టు కనబడట్లేదు. నిజంగానే కేరళ ప్రభుత్వం పెట్రోల్‌పై 9 రూపాయలు, డీజిల్‌పై 12 రూపాయలు తగ్గించుంటే ఈ రేట్లలో మార్పు ఉండేది, కానీ అలా జరగలేదు.

జూన్ 2017 నుండి, భారతదేశంలో పెట్రోల్ ధరలు ప్రతిరోజూ సవరించబడుతున్నాయి, దీనిని డైనమిక్ ఫ్యూయల్ ప్రైస్ విధానం అని అంటారు. పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రతిరోజూ, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరల ఆధారంగా సవరించబడతాయి, దీనికి ముందు ప్రతి 14 రోజులకు ధరలు సవరించబడేవి.

వివిధ కారణాలు ఇంధన ధరను ప్రభావితం చేస్తాయి. వీటిలో కొన్ని, రూపాయి నుంచి యుఎస్ డాలర్ మారకం రేటు, ముడి చమురు ఖర్చు, గ్లోబల్ క్యూస్, ఇంధన డిమాండ్ ఉన్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, భారతదేశంలో ధరలు పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇంధన ధరలో ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), మరియు డీలర్ కమిషన్ ఉంటాయి. వ్యాట్, రాష్ట్రాన్ని బట్టి మారుతుంది ఎందుకంటే రాష్ట్రాల పరిధిలో ఈ పన్ను ఉంటుంది గనుక. గత ఆరు సంవత్సరాల్లో కేరళ ప్రభుత్వం ఒకేసారి (2018లో) పెట్రోల్, డీజిల్‌పై ఉన్న ఈ పన్నులను మార్చింది. పెట్రోల్ పై 31.8% ఉంటే 30.08% చేసింది. 24.52% డీజిల్ పై ఉంటే 22.76% కు తగ్గించింది.     

జూన్ 2021లో కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్.బాలగోపాల్ మాట్లాడుతూ ఇంధన పన్నులలో రాష్ట్ర వాటాను త్యాగం చేయమని అనడాన్ని ఆయన ఒప్పుకోలేదు. పన్నును తగ్గించాలని మరియు ఇంధన ధరల పెరుగుదలతో భారమైన ప్రజలకు సహాయం చేయాలని ప్రతిపక్షాల నుండి డిమాండ్ ఉంది. పినరయి విజయన్ ప్రభుత్వం తన మొదటి టర్మ్ లో పెట్రోల్ మరియు డీజిల్‌పై పన్నును 2018లో తగ్గించారని ఆయన చెప్పారు.

చివరగా, కేరళ ప్రభుత్వం పెట్రోల్‌పై 9 రూపాయలు, డీజిల్‌పై 12 రూపాయలు ఇటీవల తగ్గించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll