Fake News, Telugu
 

పాకిస్తాన్‌లో మహిళా టిక్‌టాకర్‌పై జరిగిన దాడి వీడియోని అఫ్గానిస్తాన్ జర్నలిస్టులపై తాలిబన్ దాడిగా షేర్ చేస్తున్నారు

0

విదేశీ మీడియా సంస్థలతో పనిచేస్తున్న జర్నలిస్టులకు అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్‌లో తాలిబన్ల ట్రీట్మెంట్ అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును బాగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక మహిళపై చాలా మంది దాడి చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అఫ్గానిస్తాన్‌లో జర్నలిస్టులపై తాలిబాన్లు దాడి చేస్తున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో పాకిస్తాన్‌లో లాహోర్‌కి సంబంధించినది, అఫ్గానిస్తాన్‌లో తీసింది కాదు. 14 ఆగష్టున పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఒక టిక్‌టాకర్‌ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద టిక్‌టాక్‌ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. ఆ సమయంలో సుమారు 300 మంది ఆమెను చుట్టిముట్టి ఈ దాడికి పాల్పడ్డారు. ఆమెను గాల్లోకి ఎగరేస్తూ దుస్తులు చించడానికి యత్నిస్తున్నప్పుడు ఈ వీడియో తీసారు. జలాలాబాద్ నగరంలో తాలిబాన్లు జర్నలిస్టులపై దాడి చేసినట్లు న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ, ఈ వీడియోకు అఫ్గానిస్తాన్‌లో జరిగే సంఘటనలకు సంబంధంలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక ట్వీట్ లభించింది. 17 ఆగష్టు 2021న పబ్లిష్ చేసిన ఈ ట్వీట్ పాకిస్తాన్‌లో లాహోర్‌కి సంబంధించినదిగా తెలిపారు. ‘గ్రేటర్ ఇక్బాల్ పార్క్ లో ఆగష్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఒక అమ్మాయిని జనసమూహం ఎలా లైంగికంగా వేధింపులకు గురిచేస్తుందో చూడండి’ అని అంటూ ట్వీట్ చేసారు. బాధితురాలు ఒక టిక్-టాక్ స్టార్, ఆమె కొన్ని ‘దేశభక్తి వీడియోలను’ చిత్రీకరించడానికి అక్కడికి వెళ్లిందని ట్వీట్ ద్వారా తెలుస్తుంది.

ఈ విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియో రిపోర్ట్స్ లభించాయి. 14 ఆగష్టున పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఒక టిక్‌టాకర్‌ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద టిక్‌టాక్‌ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. ఆ సమయంలో సుమారు 300 మంది ఆమెను చుట్టిముట్టి దాడికి పాల్పడ్డారు. ఆమెను గాల్లోకి ఎగరేస్తూ దుస్తులు చించడానికి యత్నించారు. ఆమె చుట్టూ చేరిన వందలాది మంది నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎంతకూ సాధ్యం కాలేదు. ఈ పరిస్థితిని గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్తాన్ గేటు తెరవటంతో అక్కడి నుంచి తన స్నేహితులతో ఆమె బయటపడింది. బలవంతంగా ఆమె చేతికి ఉన్న ఉంగరం, చెవి రింగులు, తన స్నేహితుల వద్ద ఉన్న మోబైల్‌ ఫోన్‌, ఐడీ కార్డు, రూ.15 వేలను లాక్కున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్, నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరంలో తాలిబన్లు జర్నలిస్టులపై దాడి చేసినట్లు న్యూస్ రిపోర్ట్స్ (ఇక్కడ మరియు ఇక్కడ) ఉన్నాయి. కానీ, పోస్టులో ఉన్న వీడియోకు, అఫ్గానిస్తాన్‌లో జరిగే సంఘటనలకు సంబంధంలేదు.

చివరగా, పాకిస్తాన్‌లో మహిళా టిక్‌టాకర్‌పై జరిగిన దాడి వీడియోని ఆఫ్ఘనిస్తాన్‌లో జర్నలిస్టులపై తాలిబన్ దాడిగా షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll