Fake News, Telugu
 

పాత వీడియోని ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూస్తూ యోగి ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాని చూస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాని చూస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2017లో గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో అమరవీరుల స్మారకార్థం ‘ఏక్ దియా షహీద్ కే నామ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఒక గీతాన్ని చూసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకి ఇటీవల విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ABP న్యూస్’ సంస్థ 07 అక్టోబర్ 2017 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అమరవీరులను గౌరవించుకోవడం కోసం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్న దృశ్యాలని ఈ వీడియోలో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా ఆ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, యోగి ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకుంటున్నప్పుడు తీసిన ఇవే దృశ్యాలతో ఉన్న ఫోటోలని పలు వార్తా సంస్థలు 2017 అక్టోబర్ నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో అమరవీరుల స్మారకార్థం ‘ఏక్ దియా షహీద్ కే నామ్’ అనే కార్యక్రమాన్ని  నిర్వహించినట్టు ఈ ఆర్టికల్స్‌లో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఒక గీతాన్ని చూసి యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారని ఈ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేసారు.

‘ది కాశ్మీర్ ఫైల్స్’ చలనచిత్రానికి తమ రాష్ట్రంలో పన్ను మినహాయిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌తో పాటు గుజరాత్, అస్సాం మొదలగు బీజేపీ పాలిత రాష్ట్రాలు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి తమ రాష్ట్రాలలో వినోద పన్నును మినహాయించాయి. కాని, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చూసి యోగి ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకున్నట్టు ఇటీవల ఏ వార్తా సంస్థ రిపోర్ట్ చెయ్యలేదు.

చివరగా, పాత వీడియోని పెట్టి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూస్తూ యోగి ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll