Fake News, Telugu
 

ఖలిస్తాన్ నినాదాలు చేస్తున్న ఈ ఊరేగింపుకి, పంజాబ్ ఎన్నికల ఫలితాలకు ఎటువంటి సంబంధం లేదు

0

ఇటీవల పంజాబ్‌లో ఎన్నికలలో ఆప్ విజయం సాధించిన తెలిసిందే. ఐతే ఈ నేపథ్యంలోనే కొంత మంది సిక్కులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తున్న ఒక వీడియోని షేర్ చేస్తూ, ఈ ఊరేగింపు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత జరిగిందంటూ క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల పంజాబ్‌ ఎన్నికలలో AAP విజయం తరువాత సిక్కులు ఖలిస్తాన్ నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం):  ఈ ఊరేగింపుకి పంజాబ్ ఎన్నికల ఫలితాలకు ఎటువంటి సంబంధంలేదు. దీప్ సిద్దు మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎంక్వైరీ వేయాలని కోరుతూ అతని అభిమానులు 21 ఫిబ్రవరి 2022న బటిండాలో ఈ ఊరేగింపు నిర్వహించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియోలో ప్రజలు ఇటీవల కారు ప్రమాదంలో మరణించిన పంజాబీ నటుడు దీప్ సిద్దు ఫోటోలు ప్రదర్శిస్తుండడం గమనించొచ్చు. దీని ఆధారంగా గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని 22 ఫిబ్రవరి 2022న యూట్యూబ్‌లో చేసిన పోస్టు మాకు కనిపించింది. యూట్యూబ్‌ వీడియో వివరణలో ఈ ఊరేగింపు పంజాబ్‌లో బటిండాలో జరిగినట్టు పేర్కొన్నారు.

ఈ వివరాల ఆధారంగా గూగుల్‌లో వెతకగా ఈ ఊరేగింపుకు సంబంధించిన వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం దీప్ సిద్దు అభిమానులు అతని మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎంక్వైరీ వేయాలని కోరుతూ 21 ఫిబ్రవరి 2022న బటిండాలో ఒక ఊరేగింపు నిర్వహించారు. దీన్నిబట్టి, ఈ ఊరేగింపు పంజాబ్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే జరిగిందని స్పష్టమవుతుంది.

ఈ ఊరేగింపుకి సంబంధించిన మరికొన్ని వీడియోలు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోలో ప్రజలు ఖలిస్తాన్ నినాదాలు చేస్తున్నప్పటికీ, ఈ ఊరేగింపుకి పంజాబ్ ఎన్నికల ఫలితాలకుగాని లేదా AAPకి గానీ ఎటువంటి సంబంధంలేదు, ఎందుకంటే పంజాబ్ ఎన్నికల ఫలితాలు ఊరేగింపు జరిగిన తర్వాత మార్చ్ 10న వెలువడ్డాయి.

చివరగా, ఖలిస్తాన్ నినాదాలు చేస్తున్న ఈ ఊరేగింపుకి, పంజాబ్ ఎన్నికల ఫలితాలకు ఎటువంటి సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll