ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఒక రోడ్ మీద ఏవో నినాదాలు చేస్తూ నడుచుకుంటూ వెళుతున్న కొంతమంది మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్న వీడియో పెట్టి భారత ఆర్మీ ఢిల్లీ కి వచ్చి అక్కడ నిరసనకారుల మీద లాఠీ ఛార్జ్ చేస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో పరిశీలిద్దాం.
![](https://factly.in/wp-content/uploads//2020/03/IndianArmy-LathiCharge-Delhi-Post.png)
క్లెయిమ్: భారత ఆర్మీ ఢిల్లీ లోని నిరసనకారుల మీద లాఠీ ఛార్జ్ చేస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో డిసెంబర్ 2019 నుండే ఉంది. కావున, అది ఇటీవల జరిగిన ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన వీడియో కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టు లోని వీడియోను ‘InVID’ ప్లగిన్ లో అప్లోడ్ చేస్తే వచ్చిన కీ ఫ్రేమ్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే అందులోని ఒక కీ ఫ్రేమ్ ఒక యూట్యూబ్ వీడియోలో కనిపించింది. ఆ వీడియోని ‘SPN NEWS’ డిసెంబర్, 2019న అప్లోడ్ చేసింది అని తెలుస్తుంది. ఆ వీడియో కింద పెట్టిన శీర్షిక మరియు వివరాలలో ‘బులంద్ షహర్ లో CAA నిరసనకారుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినప్పటి వైరల్ వీడియో, ప్రశ్నలు లేవనెత్తుతుంది’ అని పేర్కొన్నారు. అంతేకాక, ఆ వీడియో గురించి చాలా సెర్చ్ రిజల్ట్స్ లో అది ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లో నిరసనకారుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినప్పటి వీడియో అని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
![](https://factly.in/wp-content/uploads//2020/02/Delhi-Police-beat-Muslims-video-1024x751.png)
ఆ వీడియో కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదాలను గూగుల్‌లో వెతికితే, 20 డిసెంబర్ 2019 న, బులంద్ షహర్ లో CAA బిల్ ని వ్యతిరేకిస్తూ జరిపిన నిరసనలలో పాల్గొన్న కొంతమంది పోలీసు వాహనాలకు నిప్పంటించడంతో ఆ నిరసనలు హింసాత్మకంగా మారాయని కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. ఆ రిపోర్ట్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియో ఏ విశ్వసనీయమైన మీడియా ఛానెల్‌లలో కనిపించనప్పటికీ, ఢిల్లీ అల్లర్లు మొదలు కాకముందు నుంచే ఉందని తెలుస్తుంది. కావున, ఢిల్లీ లో ఇటీవల జరిగిన అల్లర్లకి ఆ వీడియోకి ఏ సంబంధం లేదు.
చివరగా, ఒక పాత వీడియోని పెట్టి అది ఇటీవల ఢిల్లీలో నిరసన చేస్తున్న వారిపై లాఠీ ఛార్జ్ చేస్తున్న భారత సైన్యం అని తప్పు ప్రచారం చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?