ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్లకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంటూ కొంతమంది సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. ఫేస్ బుక్ లో ఒక నాలుగు ఫొటోలతో కూడిన ఒక పోస్ట్ పెట్టి ఢిల్లీ అల్లర్లలో కొంతమంది ముసుగు వేసుకున్న మహిళలు రాళ్లతో దాడి చేస్తున్నారనే అర్థం వచ్చేలా క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో పెట్టిన ఫోటోలు ఢిల్లీ అల్లర్లకు సంబంధించినవో కాదో పరిశీలిద్దాం.
క్లెయిమ్: ఢిల్లీ అల్లర్లలో ముసుగు వేసుకొని రాళ్లతో దాడి చేస్తున్న కొంతమంది మహిళల ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో పెట్టిన ఫోటోలు భారత దేశానికి సంబంధించినవే కాదు; అవి పాలస్తీనా దేశానికి సంబంధించిన పాత ఫోటోలు. కావున, అవి ఢిల్లీ అల్లర్ల కి సంబంధించిన ఫోటోలు అనే అర్థం వచ్చేలా పోస్ట్ లో చేసిన క్లెయిమ్ తప్పు.
ఫోటో 1:
పోస్ట్ లో పెట్టిన ఈ ఫోటో గురించి గూగుల్ లో వెతికితే అది అక్టోబర్ 2015 నుండే ఇంటర్నెట్ లో ఉందని తెలిసింది. అంతేకాక, దానికి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ లో ఆ ఫోటో ఇజ్రాయెల్ – పాలస్తీనా గొడవ కి సంబంధించింది అని ఉంది. ఆ రిజల్ట్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ ఫోటో కి సంబంధించిన సరైన సమాచారంపై ఏ విశ్వసనీయ కథనం దొరకనప్పటికీ, ఆ ఫోటో అక్టోబర్ 2015 నుండే సోషల్ మీడియాలో ఉండేసరికి, అది ఢిల్లీ అల్లర్ల కి సంబంధించిన ఫోటో కాదు అని తెలుస్తుంది.
ఫోటో 2:
పోస్ట్ లో పెట్టిన ఈ ఫోటో ‘Thetower.org’ అనే వెబ్సైటు లో కనిపించింది, దాని కింద ఉన్న వివరణ ప్రకారం ఆ ఫోటో పాలస్తీనా యువత రేచెల్ సమాధి దగ్గర యాత్రికుల పైన రాళ్లు విసురుతున్నపటిది అని తెలిసింది. పాలెస్తీనాలోని బెత్లెహాం దగ్గర ఉన్న రేచెల్ సమాధిని యూదులు, ముస్లింలు, మరియు క్రైస్తవులు పవిత్ర స్థలంగా భావిస్తారు.
ఫోటో 3:
పోస్టులో పెట్టిన ఈ ఫోటో ‘Gettyimages’ ఫోటో లైబ్రరీ లో కనిపించింది. దాని కింద ఉన్న వివరణ ప్రకారం అది బిర్జియిట్ యూనివర్సిటీ కి చెందిన ఒక పాలస్తీనా యువతి అక్టోబర్ 7, 2015న బెయిట్ ఇల్ లో, వెస్ట్ బ్యాంక్ సిటీ దగ్గర ఉన్న రమళ్ళ శివార్లలో, ఇజ్రాయెల్ భద్రతా దళాలతో జరుగుతున్న గొడవల్లో రాళ్లు విసురుతున్నప్పటి ఫోటో అని తెలిసింది. కావున, ఇది ఇజ్రాయెల్-పాలస్తీనా గొడవలకి సంబంధించిన ఫోటో.
ఫోటో 4:
పోస్టులో పెట్టిన ఈ ఫోటో ‘Reuters’ ఫోటో లైబ్రరీ లో కనిపించింది. దాని కింద ఉన్న వివరణ ప్రకారం జూన్ 5, 2012లో వెస్ట్ బ్యాంక్ సిటీ దగ్గర ఉన్న రమళ్ళ లోని ఓలెఫ్ కారాగారం దగ్గర రాళ్లు వేస్తున్న పాలస్తీనా వాళ్ళకి, ఇజ్రాయెల్ పోలీసులకి జరుగుతున్న ఘర్షణ లో రాళ్ళు విసురుతున్న ఒక పాలస్తీనా నిరసనకారురాలి ఫోటో అని తెలిసింది. కావున, ఈ ఫోటో కూడా ఇజ్రాయెల్-పాలస్తీనా గొడవలకి సంబంధించిందే.
చివరగా, పాలస్తీనా కి సంబంధించిన పాత ఫోటోలను ఇటీవల జరిగిన ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ఫోటోలు గా తప్పు ప్రచారం చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?