Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్ దుద్వ టైగర్ రిజర్వులో తీసిన పాత వీడియోని ములుగు జిల్లాలో ఇటీవల చిరుత పులి సంచరిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం మెట్ల గూడెం గ్రామంలో చిరుత పులి తన పిల్లలను వెంటబెట్టుకొని సంచరిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం మెట్ల గూడెం గ్రామంలో చిరుత పులి తన పిల్లలతో సంచరిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2020లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దుద్వ టైగర్ రిజర్వులో ఒక పులి తన నలుగురి పిల్లలతో సంచరించిస్తున్న దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియో పాతది, తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూసర్ 2020 నవంబర్ నెలలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. దుద్వ టైగర్ రిజర్వులో పులి నాలుగు పిల్లలతో సంచరిస్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ వీడియోని ఇదే వివరణతో IFS అధికారి రమేష్ పాండే 09 నవంబర్ 2020 నాడు ట్వీట్ పెట్టారు.

పోస్టులో షేర్ చేసిన ఇదే వీడియోని ‘Hindustan Times’ వార్తా సంస్థ 10 నవంబర్ 2020 నాడు తమ ఆర్టికల్‌లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దుద్వ టైగర్ రిజర్వులో ఒక పులి తన నలుగురి పిల్లలతో సంచరిస్తున్న దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఉత్తరప్రదేశ్ దుద్వ టైగర్ రిజర్వులో తీసినట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కామారం అడవుల్లో పులి సంచరిస్తుందని ఇటీవల పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలోని తాడోబా, ఇంద్రావతి అభయారణ్య ప్రాంతాల నుంచి, గోదావరి జలాలను దాటుకుంటూ పులులు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలవైపు వలస వస్తున్నాయని ఈ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేసారు. 08 నవంబర్ 2021 నాడు రాకాసి గుట్ట సమీపంలో గడ్డి మేస్తున్న పశువుల మందపై పులి విరుచుకుపడినట్టు ఈ ఆర్టికల్స్‌లో తెలిపారు. దీనితో, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయ్, గోవిందరావుపేట మండలాల్లోని ప్రజలని అడువులలోకి వెళ్ళవద్దని అటవీ అధికారులు హెచ్చరించినట్టు తెలిసింది.

చివరగా, ఉత్తరప్రదేశ్ దుద్వ టైగర్ రిజర్వులో తీసిన పాత వీడియోని ములుగు జిల్లాలో ఇటీవల చిరుత పులి తన పిల్లలతో కలిసి సంచరిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll