ఇద్దరు వ్యక్తులు పొగతో మత్తుమందు ఇచ్చి ఆభరణాలను దోచుకుంటున్న వీడియోని ఒక మతానికి ఆపాదిస్తూ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ముస్లిం వ్యక్తులు పొగతో మత్తుమందు ఇచ్చి ఆభరణాలను దోచుకుంటున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలో చూపిస్తున్నది నిజమైన సంఘటన కాదు, ఇది ప్రజలకు అవగాహన కల్పించేందుకు చిత్రీకరించింది. వీడియో చివర్లో ఒక గమనిక రూపంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. పైగా వీడియోలో టైమ్ పరిశీలించినప్పుడు కూడా ఇది నిజమైన రికార్డింగ్ కాదని స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వీడియోలో చూపిస్తున్నది నిజంగా జరగలేదు, ఇది ఒక స్క్రిప్ట్ చేయబడిన వీడియో. వీడియో చివర్లో ఇది ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసిందని ఒక గమనిక రూపంలో స్పష్టంగా పేర్కొన్నారు.
పైగా CCTV రికార్డింగ్ వీడియోలో ఇష్టానుసారంగా చూపిస్తున్న టైమ్ బట్టి కూడా ఈ వీడియో స్క్రిప్ట్ చేయబడింది అని అర్ధమవుతుంది. వీడియో మొదట్లో టైమ్ 9:34:12 చూపించగా మధ్యలో ఇష్టానుసారంగా మారుతూ ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ చూపిస్తూ, చివర్లో 9: 21:08 చూపించింది. దీన్నిబట్టి ఈ వీడియో నిజమైన CCTV రికార్డింగ్ కాదని స్పష్టమవుతుంది.
ఈ వీడియోకి సంబంధించిన సమాచారం కోసం ఫేస్‌బుక్‌లో వెతికే క్రమంలో ఇదే వీడియోని ‘రాక్ ఆన్ మీడియా’ అనే పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలో మొదట (10 నవంబర్ 2021) షేర్ చేసినట్టు తెలిసింది. ఐతే ఈ వీడియోని షేర్ చేసిన పోస్టులో ‘ఈ వీడియో కేవలం ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసిందని స్పష్టంగా పేర్కొన్నారు, పైగా ఈ పేజీలో స్క్రిప్ట్ డ్రామాలు మరియు పేరడీలు షేర్ చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు.’ పైగా ఈ పేజీలో ప్రజలకు అవగాహన కల్పించే మరికొన్ని వీడియోలు కూడా షేర్ చేసారు. దీన్నిబట్టి కూడా వీడియోలో చూపిస్తున్నది నిజమైన సంఘటన కాదని అర్డంచేసుకోవచ్చు.
ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం మేము ‘రాక్ ఆన్ మీడియా’ ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా సంప్రదించాము. వారి నుండి సమాధానం వచ్చిన తర్వాత ఈ ప్రకారం ఈ కథనం అప్డేట్ చేయబడుతుంది. ఈ వీడియోని ఎవరు చిత్రీకరించారో అనే విషయానికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది ఒక స్క్రిప్ట్ చేయబడిన వీడియో అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.
గతంలో కూడా ఇలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చిత్రీకరించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియోలను నిజమైన వీడియోలుగా భావించి షేర్ చేయగా వీటిని తప్పని చెప్తూ FACTLY రాసిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ఈ వీడియోలో పొగతో మత్తుమందు ఇచ్చి నగలు దోచుకుంటున్నట్టు చూపిస్తున్నది నిజమైన ఘటన కాదు, ఇది ప్రజలకు అవగాహన కల్పించేందుకు చిత్రీకరించింది.