Fake News, Telugu
 

చైనా దేశానికి సంబంధించిన పాత వీడియోని చూపిస్తూ తెలంగాణలో ఒక యువకుడిని పులులు చంపుతున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

0

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో డిగ్రీ చదువుతున్న ఒక యువకుడిని పులులు ఎత్తుకెళ్ళి చంపుతున్న దృశ్యాలు,అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.  

క్లెయిమ్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో డిగ్రీ చదువుతున్న ఒక యువకుడిని పులులు ఎత్తుకెళ్ళి చంపుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న ఈ ఘటన చోటుచేసుకుంది చైనా దేశంలో, తెలంగాణలో కాదు. 2017లో ఈస్ట్ చైనాలోని ఒక వైల్డ్ లైఫ్ పార్కులో ఒక టూరిస్ట్ ని ఇలా పులులు చంపాయి. వీడియో లోని ఈ ఘటనకి తెలంగాణకి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, అవే దృశ్యాలని షేర్ చేస్తూ ‘Daily Mail’ న్యూస్ వెబ్ సైట్ 2017లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. వీడియోలోని ఈ ఘటన ఈస్ట్ చైనా లోని షాంఘై నగర సమీపంలోని ఒక వైల్డ్ లైఫ్ పార్కులో చోటుచేసుకున్నట్టు అందులో తెలిపారు. కుటుంబంతో పాటు జూ పార్క్ చూడటానికి వచ్చిన ఒక యువకుడు పులులున్న బోనులో చిక్కుకొని మరణించినట్టు ఆర్టికల్ లో తెలిపారు.

ఈ ఘటనకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, CGTN న్యూస్ ఛానల్ ఈ ఘటనకి సంబంధించి పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. పోస్టులో షేర్ చేసిన అవే దృశ్యాలు కలిగిన వీడియోని CGTN తమ ఆర్టికల్ లో షేర్ చేసింది. జూ పార్క్ లోపలికి ప్రవేశించడానికి కట్టవలిసిన టికెట్ డబ్బులని కట్టకుండా లోపలికి ప్రవేశిద్దామని జంగ్ అనే వ్యక్తి జూ గోడని దూకి పులులున్న ప్రదేశంలో చిక్కుకున్నట్టు ఆర్టికల్ లో తెలిపారు. పులులు జంగ్ ని చంపుతున్నప్పుడు తీసిన వీడియో ఇదని అందులో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ మరికొన్ని చైనీస్ న్యూస్ వెబ్ సైట్స పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

కొన్ని రోజుల క్రితం విగ్నేష్ అనే ఒక గిరిజన యువకున్ని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి చంపిన వార్త నేపథ్యంలో ఇటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.

చివరగా, చైనా దేశానికి సంబంధించిన పాత వీడియోని చూపిస్తూ తెలంగాణలో ఒక యువకుడిని పులులు చంపుతున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll