Fake News, Telugu
 

హోలీ వేడుకల సందర్భంగా భగవంత్ మాన్ దిగిన పాత ఫోటోని బైక్ చోరి చేస్తూ పంజాబ్ పోలీసులకి పట్టుబడిన చిత్రమంటూ షేర్ చేస్తున్నారు

0

పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బైక్ చోరి చేస్తూ పంజాబ్ పోలీసులకి పట్టుబడిన పాత చిత్రం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బైక్ చోరీ చేస్తూ పంజాబ్ పోలీసులకి పట్టుబడిన పాత చిత్రం.

ఫాక్ట్ (నిజం): భగవంత్ మాన్ హోలీ వేడుక సందర్భంగా తన మిత్రులతో కలిసి దిగిన ఒక పాత ఫోటోని ఈ పోస్టులో షేర్ చేసారు. భగవంత్ మాన్ చిన్ననాటి స్నేహితుడు కరంజిత్ అన్మోల్ ఈ ఫోటోని ఇటీవల తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని పంజాబ్ గాయకుడు అలాగే, నటుడు కరంజిత్ అన్మోల్ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. భగవంత్ మాన్, మంజిత్ సిద్ధూలతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్న పాత చిత్రం, అంటూ ఈ ఫోటో వివరణలో కరంజిత్ అన్మోల్ తెలిపారు. కరంజిత్ అన్మోల్ పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చిన్ననాటి స్నేహితుడని తెలిసింది.

ఈ ఫోటోపై మరింత స్పష్టత కోసం ‘Newschecker’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ కరంజిత్ అన్మోల్ తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్న మంజిత్ సిద్దుని సంప్రదించింది. ఈ ఫోటోలో నల్ల చొక్కా ధరించి ఉన్న వ్యక్తి తానే అని మంజిత్ సిద్దు ఈ ఫాక్ట్-చెకింగ్ సంస్థకు తెలిపారు.

ఈ ఫోటోని 1994 లేదా 1995 సంవత్సరంలో పంజాబ్ పటియాలా నగరంలో తీసారని మంజిత్ సిద్దు తెలిపారు. కెనడా గాయకుడు హర్బజన్ మాన్ భారత దేశానికి వచ్చినప్పుడు, ఈ ఫోటోని హోలీ పండగ రోజు అతని ఇంటి మేడపై తీసినట్టు మంజిత్ సిద్దు తెలిపారు. ఈ ఫోటో దిగే సమయంలో భగవంత్ మాన్, కరంజిత్ అన్మోల్ అలాగే హర్భజన్ మాన్ తనతో పాటు ఉన్నారని, కాలేజీలో చదివుతున్న రోజుల నుండి భగవంత్ మాన్ తనకు స్నేహితుడని మంజిత్ సిద్దు ‘Newschecker’ సంస్థకు తెలిపారు. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంజిత్ సిద్దు స్పష్టం చేసారు.

చివరగా, భగవంత్ మాన్ హోలీ వేడుకల సందర్భంగా దిగిన ఒక పాత ఫోటోని బైక్ చోరి చేస్తూ పంజాబ్ పోలీసులకి పట్టుబడిన చిత్రమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll