Fake News, Telugu
 

నర్మదా నది యొక్క లోతులేని నీటిలో నడిచిన మహిళను నర్మదా మాతా అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

నర్మదా నదిపై నడిచిన ఒక మహిళకు సంబందించిన వీడియో అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నది ఉపరితలంపై నడిచినందుకు తనను నర్మదా మాతా అని మధ్య ప్రదేశ్ జబల్పూర్ వాసులు కొలుస్తున్నట్టు ఈ పోస్టులో చెప్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: నీటిలో మునిగిపోకుండా నర్మదా నదిపై నడుస్తున్న నర్మదా మాత వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు జ్యోతి రఘువంశీ. ఆమె మధ్య ప్రదేశ్ లోని నర్మదాపురం నివాసి. ఆమె తీర్థయాత్ర సమయంలో, జబల్‌పూర్‌లోని నర్మదా నది యొక్క లోతులేని నీటిలో నడిచింది. దీన్ని చూసి అక్కడి ప్రజలు ఆమెను  దేవతగా పొరపాటు పడ్డారు. ఈమె 10 నెలల క్రితం ఇంటి నుంచి బయటికి వచ్చేసింది అని తెలిసి పోలీసులు ఆమెను తన కుటుంబంతో తిరిగి కలిపేందుకు వారిని సంప్రదించారు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదారి పట్టించే వేదంగా ఉంది.

పోస్టులో చెప్తున్న విషయాన్ని గురించి మరింత తెలుసుకోవడానికి సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా  ఈ సంఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు దైనిక్ భాస్కర్ ప్రచురించిన గ్రౌండ్ రిపోర్టులు దొరికాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 8 ఏప్రిల్ 2023న జరిగింది, జ్యోతి రఘువంశీ అనే మహిళ నీటిపై నడుస్తున్నట్లు కనిపించిన ఒక వైరల్ వీడియో జనాలను ఆకర్షించింది. దీనితో ఆమెను ‘నర్మదా దేవి’ అని నమ్మి ఆశీస్సులు కోరేందుకు ప్రజలు వేల సంఖ్యలో తన చుట్టూ గుమిగూడారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు జోక్యం చేసుకోవలసిన పరిస్థితి కూడా వచ్చింది.

అయితే అసలు తను నీటిపై ఎలా నడవగలిగింది అని టైమ్స్ అఫ్ ఇండియా వారు ఒక ఇంటర్వ్యూలో తనను అడుగగా, ఇందులో ఎలాంటి అద్భుతం లేదని, మోకాళ్ళ కంటే తక్కువ లోతు ఉన్న నీటిలో తను నడిచానని స్పష్టంగా తెలిపింది.

పోలీసులకు తన గురించి చెవుతూ తను మధ్య ప్రదేశ్ యొక్క నర్మదా పురం నివాసి అని, నర్మదా నదిలో తీర్థయాత్ర చెయ్యటానికి ఎవరికీ చెప్పకుండా 10 నెలల క్రితం ఇంటి నుండి బయటికి వచ్చేసానని అన్నారు. పోలీసులు ఆమెను తన కుటుంబాన్ని తిరిగి కలిపేందుకు కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తను మానసికంగా సరిగా లేదు అని చెపుతూ కుటుంబ సభ్యులు మిస్సింగ్ రిపోర్టును ఫైల్ చేశారు అని టైమ్స్ అఫ్ ఇండియా కథనంలో రాసారు

చివరిగా, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో తన తీర్థయాత్రలో భాగంగా నర్మదా నది యొక్క లోతులేని నీటిలో నడుస్తున్న ఒక మహిళను వీడియో తీసి ఆమెను నర్మదా మాతగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll