Fake News, Telugu
 

ప్రముఖ బాడీ బిల్డర్ రోన్నీ కోల్మన్ హిందూ మతాన్ని స్వీకరించాడన్న వార్తలో నిజం లేదు

0

ప్రముఖ బాడీ బిల్డర్ రోన్నీ కోల్మన్ హిందూ మతాన్ని స్వీకరించాడని చెప్తూ, రోన్నీ కోల్మన్ శ్రీ రాముడి ఫోటో ఉన్న టీ షర్టు వేసుకున్న ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రముఖ బాడీ బిల్డర్ రోన్నీ కోల్మన్ హిందూ మతాన్ని స్వీకరించాడు.

ఫాక్ట్ (నిజం): ప్రముఖ బాడీ బిల్డర్ రోన్నీ కోల్మన్ హిందూ మతాన్ని స్వీకరించలేదు, అతను హిందూ మతాన్ని స్వీకరించినట్టు వార్తా కథనాలు గాని లేక రోన్నీ తరపు నుండి అధికారిక ప్రకటన కాని రాలేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటో కూడా నిజమైనది కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ విషయం గురించి సమాచారం కోసం మేము గూగుల్ లో వెతకగా రోన్నీ కోల్మన్ హిందూ మతాన్ని స్వీకరించినట్టు వార్తా కథనాలు గాని లేక రోన్నీ తరపు నుండి అధికారిక ప్రకటన కాని రాలేదు. పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అచ్చం పోస్టులో షేర్ చేసిన ఫోటో లాంటిదే, కాకపోతే టీ-షర్టు పై శ్రీ రాముడి ఫోటోగాని, రోన్నీ నుదిటిన బొట్టు గాని లేని ఫోటోని షేర్ చేసిన పాత సోషల్ మీడియా పోస్టులు, బ్లాగ్ లు చాలా కనిపించాయి. ఇలాంటి ఒక ఫోటోని మరియు పోస్టులోని ఫోటోని పోల్చి చూసినప్పుడు  డిజిటల్ గా ఎడిట్ చేసి రాముడి ఫోటో మరియు నుదిటిన బొట్టు అతికించారని చెప్పొచ్చు.

రోన్నీ కోల్మన్ 1998- 2005 వరకు వరుసగా ఎనిమిది సార్లు మిస్టర్ ఒలింపియా (అంతర్జాతీయ-ప్రొఫెషనల్ పురుషుల బాడీబిల్డింగ్ పోటీ) టైటిల్ గెలిచిన రిటైర్డ్ అమెరికన్ బాడీ బిల్డర్. ఇతను 26 సార్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అఫ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ (IFFB) టైటిల్స్ ని గెలుపొందాడు. రోన్నీ కోల్మన్ పలు సార్లు భారత దేశానికి వచ్చాడు. 2011లో పూణేలో ఒక ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చాడు. 2014లో ముంబైలో వికలాంగులైన బాడీ బిల్డర్లను సన్మానించే కార్యక్రమం కోసం భారత దేశానికి వచ్చాడు. రోన్నీ కోల్మన్ ముంబై లేదా చెన్నైలో జిమ్ ఎక్విప్మెంట్ తయారు చేసే పరిశ్రమ స్థాపించాలనుకుంటున్నట్టు 2016లో  ది హిందూ ఒక వార్తా కథనం రాసింది. రోన్నీ కోల్మన్ భారత్ కి వచ్చినప్పటి కొన్ని వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇతనికి సంబంధించిన అధికారిక యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడొచ్చు. ఇంతకు ముందు కూడా రోన్నీ కోల్మన్ ఇస్లాం మతాన్ని స్వీకరించాడని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసారు, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు, ఐతే ఈ వార్తలో కూడా నిజం లేదు.

చివరగా, ప్రముఖ బాడీ బిల్డర్ రోన్నీ కోల్మన్ హిందూ మతాన్ని స్వీకరించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll